సంతులిత వృద్ధే ప్రభుత్వ లక్ష్యం

22 Jan, 2016 04:29 IST|Sakshi
సంతులిత వృద్ధే ప్రభుత్వ లక్ష్యం

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతులిత వృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబుచెప్పారు. ప్రపంచ ఆర్ధిక వేదిక 46వ సదస్సుకు హాజరైన ఆయన గురువారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, ఆర్థికశాఖ కార్యదర్శులతో కలసి సీఐఐ ఇన్వెస్టర్స్ మీట్‌లో ప్రసంగించారు. అరుణ్‌జైట్లీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ర్టం అద్భుతమైన వృద్ధి రేటుతో దూసుకుపోతోందని చెప్పారు.  అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలపైనా ప్రధానంగా దృష్టిపెట్టామన్నారు. అభివృద్ధికి నిధులు సమస్య కాదని, సైబరాబాద్, హైదరాబాద్‌లను ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టకుండానే అభివృద్ధి చేశానని చెప్పారు.

ఏపీలో అపార ఖనిజ సంపద, వ్యవసాయ ఉత్పత్తులు, సుదీర్ఘ తీరప్రాంతం, అన్నింటికీ మించి నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండటం పెట్టుబడిదారులకు కలిసోచ్చే అంశాలని వివరించారు.అనంతరం పారిశ్రామిక, రాజకీయ ప్రముఖులతో చంద్రబాబు 20కి పైగా సమావేశాలు నిర్వహించారు. రక్షణరంగ ఆయుధాల ఉత్పత్తిలో అతిపెద్దదైన లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన సీఎం రక్షణ పరికరాల తయారీకి ఏపీలో అనువుగా ఉన్న ప్రాంతాలు, వాటి ప్రత్యేకతలను వారికి వివరించారు.

దీనికి సానుకూలంగా స్పందించిన కంపెనీ సీఈవో మార్లిన్ హ్యూసన్ భారత్‌లో ప్లాంట్ నెలకొల్పేందుకు సిద్ధమని ప్రకటించారు. ఎయిర్‌బస్ సీఈవోతో జరిపిన చర్చల్లో సీఎం రక్షణ, అంతరిక్ష పరిశోధన రంగాలకు రాష్ట్రం అనుకూలంగా ఉంటుందని చెప్పారు.  అనంతపురంలో విమానయాన రంగానికి మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు.

ఎం.ఆర్.ఒ. సెంటర్ స్థాపనకు పుట్టపర్తిని పరిశీలించాలని కోరారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన ఎయిర్‌బస్ సీఈవో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తానని చెప్పారు. హీరో గ్రూప్ అధినేత పవన్ ముంజల్ సీఎంతో సమావేశమై ఏపీలో నెలకొల్పే తమ ప్లాంట్‌కు శంకుస్థాపన తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
 
24న సింగపూర్‌కు సీఎం బృందం
సీఎం బృందం దావోస్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచే ఈ నెల 24న సింగపూర్ పర్యటనకు వెళ్లనుంది.ఈ పర్యటనకు  అభ్యంతరం లేదని కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. దీంతో చంద్రబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేశ్, సీఎం కార్యదర్శి సాయిప్రసాద్, సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ సింగపూర్ పర్యటనకు సంబంధించి జీఏడీ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సింగపూర్‌లో బాబు రాజధాని మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేయనున్న అసెండాస్ సెంబ్రిడ్జి అండ్ సెమ్బ్‌క్రాప్ కన్సార్టియం ప్రతినిధులతో పాటు సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు