'ప్రధాని మాటలు... దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది'

3 Jan, 2014 16:02 IST|Sakshi
'ప్రధాని మాటలు... దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది'

ప్రధాని మన్మోహన్ సింగ్పై లోక్సభలో తెలుగుదేశం పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... దేశంలో అవినీతిని ప్రధాని మన్మోహన్ సింగ్,  యూపీఏ అధ్యక్షురాలు సోనియా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, ప్రధాని మన్మోహన్ సింగ్లు పెంచి పోషించారని ఆయన ఆరోపించారు. అలాంటి ప్రధాని అవినీతిని నిర్మూలిస్తానని మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు.

 

బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు సాక్షాత్తు ప్రధాని కార్యాలయంలో మాయమైన సంగతిని ఆయన మరచినట్లున్నారిని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. ఆ అంశంపై కనీసం ఆయన నోరు కూడా విప్పలేదన్నారు. అలాంటి ఆయన ఎలా అవినీతిని నిర్మూలిస్తారని ప్రశ్నించారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల నాశనం చేసిందని విమర్శించారు. అలాంటి పార్టీ మరో నేతను విమర్శించే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు.

 

ఇటీవల నాలుగు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైందని, అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎదురవుతుందని నామా నాగేశ్వరరావు జోస్యం చెప్పారు. విభజన బిల్లులో తెలంగాణకు నష్టం కలిగించే అంశాలను తొలగించాలని, అలాగే సీమాంధ్రలో సమస్యలను పరిష్కరించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు