నంద్యాల.. చరిత్రాత్మక ఎన్నిక: వైఎస్‌ జగన్‌

21 Aug, 2017 17:45 IST|Sakshi

- నవరత్నాల వెలుగులకు నంద్యాలలో గెలుపే నాంది
- మోసకారి చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలి
- నంద్యాలను జిల్లా కేంద్రం చేస్తాం.. అభివృద్ధి బాధ్యత నాది
- టీడీపీ వాళ్లు డబ్బుతో వస్తారు.. మీరు మాత్రం న్యాయాన్నే గెలిపించండి
- నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడి వ్యాఖ్యలు


సాక్షి, నంద్యాల:
‘ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేయండి.. రాబోయే రోజుల్లో నవరత్నాల వెలుగులకు నంద్యాల నుంచే నాంది పలకండి’ అని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం స్థానిక గాంధీచౌక్‌లో ఆయన మాట్లాడారు. నంద్యాల ప్రజలు తనపై చూపిస్తోన్న ప్రేమానురాగాలను చూసి చంద్రబాబు వెన్నులో భయంపుట్టిందని, అందుకే అడ్డదారుల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని గుర్తుచేశారు. నంద్యాల అభివృద్ధి బాధ్యతను తనపై మోపి నీతిని, ధర్మాన్ని గెలిపించాలని అభ్యర్థించారు.

‘‘మీరంతా నాకోసం వచ్చి ఎండలో నిల్చున్నారు. చిరునవ్వుతోనే ఆత్మీయతలను పంచిపెడుతున్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు నేను కృతజ్ఞుడిని. ఇక్కడికొచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు.. ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి.. చేతులో జోడించి, శిరస్సు వంచి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇవాళ నంద్యాలలో ఉప ఎన్నిక జరుగుతున్నాయి. దాదాపుగా ప్రతి గ్రామంలో తిరిగాం. ఈ 13 రోజులుగా మీరు పంచిన ఆత్మీయతను చూశా. నేనొక్కడినేకాదు.. రాష్ట్రం మొత్తం కూడా చూసింది. ఆ ఆత్మీయత.. చంద్రబాబు వెన్నెముకలో భయాన్నికూడా పుట్టించింది. అందుకే సీఎంతోపాటు క్యాబినెట్‌ మొత్తం ఇక్కడికి దిగింది. గడిచిన మూడున్నర సంవత్సరాల్లో చంద్రబాబును నంద్యాల రోడ్లపై ఎప్పుడైనా చూశారా? ఆయనంటారు.. జగన్‌కు పనిలేదు.. 15 రోజులుగా నంద్యాలలో తిరుగుతున్నాడు అని. నిజానికి తిరగాల్సింది నేను కాదు.. ఆయన తిరగాలి. సీఎం పదవిలో ఉన్నాయన ప్రజల కోసం తిరగాలి. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కాదు.

చంద్రబాబు మనస్తత్వం ఏమంటే.. ఎన్నికలు వచ్చినప్పుడే ఆయనకు ప్రజలు గుర్తొస్తారు. 2014లో నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే చనిపోతే.. సానుభూతితో వైఎస్సార్‌సీపీ పోటీ పెట్టలేదు. ఆ తర్వాత చంద్రబాబు నందిగామ ముఖం చూశారా? అని గుర్తుచేస్తున్నా. ఇవాళ మూడున్నర సంవత్సరాల తర్వాత చంద్రబాబు పరిపాలకు తీర్పు ఇవ్వబోతున్నాం. తాను చేసిన మోసానికి వ్యతిరేకంగా మీరు ఓటు వేయబోతున్నారు. ఆయన చేసిన అవినీతికి, దుర్మార్గానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నాం. రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత లేకపోతే ప్రజాస్వామ్యం దిగజారిపోతుంది. ఎన్నికలప్పుడు హామీలిచ్చి, తర్వాత మోసం చేస్తే వ్యవస్థకాదు.. ప్రజలు నాయకుల కాలర్‌ పట్టుకుని నిలదీసే రోజు రావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.

ఈ మూడేళ్లలో ఏం చేశాడు? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా... ఉప ఎన్నికలు వచ్చేదాకా ఒక్క రోజైనా ఆయన నంద్యాల నడిరోడ్డుపై కనిపించారా? పేదలకు ఇళ్లు, రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావలంటే బాబు రావాలని టీవీల్లో ప్రచారం చేశారు. మరి ఈ మూడున్నరేళ్లలో హామీని నిలబెట్టుకున్నారా? , డ్వాక్రా మహిళలకు హామీలు ఇచ్చారు..14 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని మాటిచ్చారు.. నిలబెట్టుకున్నాడా? ఆయన సీఎం అయిన తర్వాత రేషన్‌ సరుకుల్లో ఎన్నింటికి కత్తెర వేశారు? ఎన్నికలప్పుడు టీవీల్లో ఏమేం చెప్పించారు? జాబు రావాలంటే.. బాబు రావాలన్నారు.. జాబు రాకుంటే ప్రతి ఇంటికీ రూ.2 వేలు ఇస్తామన్నారు. ఆయన సీఎం అయి 38 నెలలలైంది. 1.70కోట్ల ఇళ్లున్నాయి. ప్రతి ఇంటికీ 78 లక్షలు బాకీ పడ్డాడా లేదా? వీటిలో కనీసం ఒక్క రూపాయానై ఇచ్చాడా? ప్రజలను మోసం చేశాడు. ఆయన సీఎం కావడం కోసం సమాజంలోని అన్ని వర్గాలనూ మోసం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మోసాలకు అంతే ఉండదు

నిజం చెప్పనివాడే చంద్రబాబు: జీవితంలో ఒక్క అబద్ధం చెప్పనివాడిని సత్యహరిశ్చంద్రుడు అంటాం. అదే, ఒక్క నిజం కూడా చెప్పనివాడిని నారా చంద్రబాబునాయుడు అంటాం. ముఖ్యమంత్రి హోదాలో మూడేళ్ల కిందట కర్నూలుకు వచ్చి చాలా చెప్పారు. సీఎం చెబితే చేస్తారని మనమంతా అనుకున్నాం. కర్నూలుకు ఎయిర్‌పోర్ట్‌, స్మార్ట్‌ సిటీ చేస్తామన్నారు. ఇప్పుడు నంద్యాలను స్మార్ట్‌ సిటీ చేస్తామంటున్నారు. ట్రిపుల్‌ఐటీ కాలేజీ కడతామన్నారు.. స్విమ్స్‌ తరహాలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి అన్నారు.. అవుకు దగ్గర పార్క్‌, మైనింగ్‌ స్కూలు, ఉర్దూ యూనివర్సిటీ, ఆపారెల్‌పార్కులు, కడతామన్నారు. కేసీ కెనాల్‌ గుండ్రేవుల ప్రాజెక్టు కడతామనిచ ఎప్పారు. వీటిలో కనీసం ఒక్కటైనా కట్టారా అని అడుగుతన్నా. ఇవాళ నంద్యాలలో ఉప ఎన్నిక వచ్చేసరికి.. మళ్లీ అరిగిపోయిన టేప్‌రికార్డర్‌ వేస్తున్నారు. మళ్లీ అవే మోసాలు, అవే అబద్ధాలు. అలాంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా ఇంటికి పంపించాలి. ఇలాంటి పార్టీని బంగాళాఖాతంలో కలపాలి.

ఇది చరిత్రాత్మక ఎన్నిక: తాను ముఖ్యమంత్రిననే అహంకారం చంద్రబాబుకు ఉంది. ఏమైనా చెయ్యొచ్చు.. ఎవరైనా ఏమైనా అంటే పోలీసులను పంపిచ్చొచ్చని ఆయన భావన. ప్రశ్నించినవాళ్లని కళ్లు పెద్దవి చేసి ‘నువ్వు జగన్‌ మనిషివ’ని అంటాడు. నిలదీసినవాళ్లపై అపనిందలువేసి, పోలీస్‌ స్టేషన్లలో పెట్టిస్తారు. ఈ వ్యవస్థలో మార్పు రాకుంటే, చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి. లేకుంటే, ప్రతి ఇంటికీ మారుతీ కారు, కేజీ బంగారం ఇస్తామంటాడు. మూడున్నరేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చాయి. మోసం చేసివాళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. నంద్యాలలో వేసే ఓటు చరిత్రాత్మకమైనది. ఇక్కడి నుంచి మొదలయ్యే మార్పు శ్రీకాకుళం దాకా వెళుతుంది. చంద్రబాబుకు ఓటేయకపోతే నంద్యాల అభివృద్ధి ఆగిపోతుందని భయపెట్టిస్తున్నారు. కానీ మీకో మాటిస్తున్నా.. చంద్రబాబు మాదిరి డబ్బులేదు, పదవి లేదు, పోలీసులు లేరు, ఉన్నదిలేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించలేను. నా దగ్గరున్న ఆస్తి.. దివంగత నేత ప్రయతమనాయకుడు రాజశేఖర్‌రెడ్డిగారు పోతూపోతూ ఇచ్చిన ప్రజలే నా కుటుంబం. ఆయన చేసిన మంచి, సంక్షేమ పథకాలు ఇవ్వాళ్టికీ బతికే ఉన్నాయి. అదే నాకున్న ఆస్తి. జగన్‌ మోసం చేయడు. జగన్‌ అబద్ధమాడడు. జగన్‌ ఏదైనా చెబితే మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు. వాళ్ల నాన్న మాదిరే ప్రజలకు మంచిచేస్తాడు. జనానికి మేలు చేయాలనే నవరత్నాలను ప్రకటించాడు. వాళ్ల నాన్న లాగే మంచి చేస్తారని జనం నమ్ముతున్నారు. అదే నాకున్న పెద్ద ఆస్తి. దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదంతో అవి కలకాలం కొనసాగుతాయి. మనం గుడికిపోయినా, చర్చికిపోయినా, మసీదుకు పోయినా.. దేవుడికి దగ్గరికి కావాలని పోతాం. దేవుడు మనకేం చెబుతాడు? అన్యాం చేయొద్దు, అధర్మం చేయొద్దు అని చెబుతాడు. మూడేళ్లుగా జరుగుతోన్న అన్యాయానికి వ్యతిరేకించండి జరుగుతోన్న అన్యాయాన్ని ఇప్పుడు తిప్పుకొట్టే సమయం వచ్చింది.

చంద్రబాబు నంద్యాలలో డబ్బులు పంపిణీ చేస్తున్నాడు.. అక్కడక్కడ 2వేలు, ఒక్కోచోట 5వేలు ఇస్తున్నారని తెలుసు. ఒక్కొక్కరి చేతిలో డబ్బులుపెట్టి దేవుడి బొమ్మ మీద ప్రమాణం చేయిస్తారు. ఏ దేవుడైనా పాపానికి ఓటేయమని చెప్పడని ఖచ్చితంగా చెబుతున్నా. అలా చెప్పేది దెయ్యాలు మాత్రమే. అలాంటప్పుడు దేవుణ్ని మనసులో తలచుకుని ధర్మం వైపే ఉండాలని అనుకోండి. లౌక్యంగా వ్యవహరించండి. ఓటు మాత్రం ధర్మానికే ఓటేయండి. న్యాయాన్ని గెలిపించండి. మీకు ఒకటే హామీ ఇస్తున్నా.. నంద్యాల అభివృద్ధిని నాకొదిలేయండి. పులివెందుల మీద ఎలా శ్రద్ధచూపిస్తానో, నంద్యాలపైనా అలానే చూపిస్తా. రాబోయే రోజుల్లో నంద్యాలను జిల్లా చేస్తాం. నవరత్నాలను ప్రకటించాం. అవి ప్రతి ఇంటికీ చేరితే ప్రతి కుటుంబంలో వెలుగులు కనిపిస్తాయి. అలా జరగాలంటే ఇప్పుడున్న వ్యవస్థ ఇంకా మారాలి. పథకాలు ప్రజల దగ్గరికి వెళ్లాలంటే 13 జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తామని చెబుతున్నా. నంద్యాల జిల్లా హెడ్‌క్వార్టర్‌ అయిన తర్వాత ఇక్కడే కలెక్టరేట్‌, మిగతా ఆఫీసులన్నీ వస్తాయి. అప్పుడు నంద్యాల ఎలా అభివృద్ధి చెందుతుందో నేను చెప్పాల్సిన పనిలేదు.

చంద్రబాబు చేసేది అభివృద్ధే కాదు.. రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో బిల్డింగులు పగడొట్టడమే అభివృద్ధి అనుకుంటున్నారు. మూడున్నరేళ్లు పట్టించుకోకుండా ఉప ఎన్నికలు వచ్చిన తర్వాతే రోడ్డు విస్తరణ చేపట్టారు. షాపులు కోల్పోయినవారి కడుపుల గురించి ఆలోచించలేదు. మార్కెట్‌ రేటు ప్రకారం వాళ్లకు న్యాయం చేయాలి. కానీ గజానికి 1.10లక్షలు పలికే స్థలానికి ముష్టి రూ.18 వేలు ఇచ్చారు. ఇదా అభివృద్ధి? చంద్రబాబు కట్టించే ఇళ్లు తీసుకుంటే పేదలు అప్పులపాలు కావాల్సిందే. రూ.3 లక్షలు ఖర్చయ్యే ఇంటిని రూ.6లక్షలుపెట్టి కాంట్రాక్టర్లతో కట్టిస్తారట. వాటిలో లక్షన్నర కేంద్ర సబ్సిడీ, మరో లక్షన్నర రాష్ట్రం సబ్సిడీ. మరో మూడులక్షల అప్పును.. 20 ఏళ్లపాటు కట్టాలి. ఒక్క సంవత్సరం గట్టిగా దువా చెయ్యమని కోరుతున్నా. ఒక్క సంవత్సరం ఓపిక పడితే.. వచ్చేది మన ప్రభుత్వమే. ఏ పేదవాడూ అప్పుతీసుకుని ఇళ్లు కట్టుకోవల్సిన అవసరం లేదు. ఉచితంగా ఇల్లు కట్టి, రిజిస్ట్రేషన్‌ చేసిస్తామని మాటిస్తున్నా. ఈ బిల్డింగ్‌ వాళ్లందరికీ మార్కెట్‌ రేటు కట్టిస్తామని మాటిస్తున్నా. మార్కెట్‌లో చిరువ్యాపారులకు న్యాయం చేస్తాం. ఆటోనగర్‌లో వాళ్లకు భూములు రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తాం. గుండ్రేవుల ప్రాజెక్టు జగన్‌ పూర్తిచేస్తాడని హామీ ఇస్తున్నా. నంద్యాలలో తిరుగుతున్నప్పుడు అగ్రిగోల్డ్‌, కేశవరెడ్డి బాధితులు నా దగ్గరికొచ్చారు. ఆ రెండు కుంభకోణాలతో చంద్రబాబుకు సంబంధం ఉంది కాబట్టి బాధితులకు న్యాయం జరగదు. మనం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో మీకు కోల్పోయినదంతా ఇచ్చేస్తాం. అడ్డుపడితే.. అవసరమైతే చంద్రబాబు చొక్కా ఇప్పిస్తాం. ఆదినారాయణరెడ్డి నిక్కర్‌ కూడా విప్పిస్తాం.

మన గుర్తు ఫ్యాన్‌:మోసం చేసినవాళ్లకు ఓటు వేయమని సంకేతం పంపండి. మీ చల్లని దీవెనలు వైఎస్సార్‌కాంగ్రెస్‌ పట్ల, మోహన్‌అన్న పట్ల సంపూర్ణంగా , రేపు నవరత్రాలతో జీవితాలు బాగుపడేలా నంద్యాల నుంచే ఆశీర్వదించాలని పేరుపేరునా ప్రార్థిస్తాఉన్నాను. వెళ్లే ముందు ఒక్క విషయం చెప్పాలి.. పార్టీ గుర్తు గుర్తుంచుకోండి. ప్రజల్ని అయోమయానికి గురిచేయడానికి ఎస్‌.మోహన్‌రెడ్డి అనే పేరుతో 10 మందితో నామినేషన్‌ వేయించాయి. అందుకే గుర్తు గురించి మళ్లీ ఒకసారి చెబుతున్నా.. ఫ్యాన్‌ గుర్తుకే ఓటేయండి’’ అని జగన్‌ అన్నారు.
చదవండి: టీడీపీ బెదిరింపులకు భయపడొద్దు: శిల్పా
స్మశానానికి ముగ్గు..చంద్రబాబుకు సిగ్గు ఉండదు: రోజా విమర్శ
సీఎం ఆరోపణలు హాస్యాస్పదం: శిల్పా ఫ్యామిలీ