పాలు, కూరగాయలమ్ముకుని బతుకుతున్నాం

27 Sep, 2015 01:25 IST|Sakshi
పాలు, కూరగాయలమ్ముకుని బతుకుతున్నాం


ఏపీ సీఎం తనయుడు నారా లోకేశ్ వ్యాఖ్య
బాబు పేరిట ఆస్తులు రూ.42.40 లక్షలే అని ప్రకటన
భువనేశ్వరి పేరుతో రూ.33.07 కోట్ల ఆస్తులు
తన పేరుతో రూ.7.67కోట్లు, బ్రహ్మణి పేరిట
రూ.4.77కోట్ల ఆస్తులున్నాయన్న లోకేశ్
ఏడాదిలో నలభై శాతం తగ్గిన బాబు ఆస్తుల విలువ!

గతేడాది రూ.70.69 లక్షలు ఉండగా ఈ సారి 42.40 లక్షలే!
 
 సాక్షి, హైదరాబాద్: తమ కుటుంబం పాలూ, కూరగాయలు అమ్ముకుని బతుకుతోందని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్. ఈ వ్యాపారంతో తాము సంతోషంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో శనివారం లోకేశ్ తమ కుటుంబ ఆస్తుల ప్రకటన చేశారు. తన తండ్రి చంద్రబాబు ఆస్తుల విలువ రూ.42.40 లక్షలని, త ల్లి భువనేశ్వరి ఆస్తిరూ. 33.07 కోట్లు, తన ఆస్తి రూ. 7.67 కోట్లు, భార్య బ్రహ్మణి ఆస్తి రూ.4.77 కోట్లని తెలిపారు. నిర్వాణ హోల్డింగ్స్ ఆస్తుల విలువ రూ.1.37 కోట్లని చెప్పారు. తాము నిర్వహించే హెరిటేజ్ కంపెనీ ప్రస్తుత విలువ రూ. 913 కోట్లని చెప్పారు. అది ఏటా రూ. 30 కోట్ల లాభాలు ఆర్జిస్తోందన్నారు.  

 ఏడాదిలో నలభై శాతం తగ్గిన విలువ!
 లోకేశ్ ప్రకటన ప్రకారం... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఆస్తుల విలువ దాదాపు నలభై శాతం తగ్గింది. బంజారాహిల్స్‌లోని ఇళ్లు, సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తం కలిపి చంద్రబాబు ఆస్తి గతేడాది రూ.70.69 లక్షలు ఉండగా ఈ సారి రూ.42.40 లక్షలుగా చూపించారు. సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లో గత సంవత్సరం రూ. 45.96 లక్షలు ఉండగా ఈ సారి ఆ మొత్తం 25.29 లక్షలకు తగ్గింది. పంజాగుట్టలోని భవనం, రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములు వగైరా అన్నీ కలిపి భువనేశ్వరి ఆస్తులు గత ఏడాది కంటే దాదాపు రూ.2.47 కోట్లు పెరిగాయి.

లోకేష్ నికర ఆస్తులు గత ఏడాది కంటే పెరిగాయి. ఈ సారి ఆయన ఆస్తుల విలువ రూ.7.67కోట్లు (గత ఏడాది రూ. 3.57కోట్లు)కు చేరింది. మొత్తం ఆస్తులు కూడా గత ఏడాది కంటే రూ.13.47 కోట్లు పెరిగాయి. గత ఏడాది మహారాష్ర్టలోని రాయగఢ్ జిల్లాలో 8.426 ఎకరాల వ్యవసాయ భూమి విలువ రూ.58.69 లక్షలుగా చూపారు. అయితే ఈసారి ఆ భూమి వివరాలను ఆస్తుల్లో చూపలేదు. శనివారం వెల్లడించిన ఆస్తుల్లో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనగూడ గ్రామంలో ఐదెకరాల విస్తీర్ణంలోని ఫాంహౌస్‌ను పొందు పరిచారు. దీని విలువ రూ. 2.21 కోట్లుగా చూపారు. ఆస్తులు ప్రకటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రివర్గంలో ఉన్న వారిపై ఆరోపణలు వస్తున్నాయని మీరే (మీడియా) చెప్తున్నారు, ఆరోపణల ఆధారంగా మంత్రివర్గం నుంచి తొలగించలేం కదా... అన్నారు.

వాటిలో వాస్తవాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆరోపణల ఆధారంగా మంత్రివర్గ సభ్యులపై చర్య తీసుకోవాల్సి వస్తే కేంద్రంలోని మోదీ మంత్రివర్గంలో కూడా ఎవ్వరూ మిగలరని లోకేశ్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షల పేరుతో యువతను రెచ్చగొట్టి ఆస్తులు ధ్వంసం చేస్తామంటే అనుమతి ఎలా ఇస్తాం... దీక్షల పేరుతో బస్సుల దహనం, ఆస్తుల ధ్వంసం వంటి చర్యలకు పాల్పడతారని ప్రభుత్వానికి సమాచారం ఉందని లోకేశ్ చెప్పుకొచ్చారు. అందువల్లే దీక్షకు అనుమతి ఇవ్వలేదని, రోడ్డుపై దీక్ష చేస్తాం, ట్రాఫిక్ స్తంభింపచేస్తామంటే అనుమతి ఇవ్వటం కష్టం కదా అని అన్నారు. వారం పది రోజుల్లో పార్టీ కార్యవర్గాన్ని నియమిస్తామని, హెరిటే జ్ కంపెనీని ఆఫ్రికా, ఆసియా దేశాల్లో విస్తరిస్తామని ఆ కంపెనీ తరపున తెలంగాణ ప్రభుత్వానికి పన్నులు కడుతున్నామని లోకేశ్ అన్నారు.

మరిన్ని వార్తలు