మరణానికి కారణాలేవి?

25 Aug, 2015 02:04 IST|Sakshi

* నారాయణ విద్యార్థినుల మృతిపై ప్రభుత్వానికి నివేదిక
* వెల్లడి కాని అసలు కారణాలు
సాక్షి, హైదరాబాద్/తిరుచానూరు: అనుకున్నదే నిజమైంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కడప సమీపంలోని సీకే  దిన్నె నారాయణ కాలేజీ ఇంటర్ విద్యార్థినుల మృతికి గల కారణాలపై నియమించిన విచారణ కమిటీ.. సరైన కారణాలు లేకుండానే తన నివేదికను సమర్పించింది. కమిటీ సభ్యులు ప్రొఫెసర్ విజయలక్ష్మి (పద్మావతి మహిళా వర్సిటీ రిజిస్ట్రార్), సులోచన (కడప డీఆర్వో), మాణిక్యం (ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి) సోమవారం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు తిరుపతిలో ఆ నివేదికను సమర్పించారు.

ఫ్యాక్సు ద్వారా విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియాకు ఒక కాపీ పంపించారు. అయితే మంత్రి నారాయణ కాలేజీ కావడంతోనే విద్యార్థినుల అనుమానాస్పద మృతిపై విచారణ కమిటీ లోతుగా విచారణ చేయలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కమిటీ వల్ల నిజాలు తేలవన్న పలువురి అనుమానాలకు బలం చేకూర్చేలానే నివేదిక ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఇద్దరు విద్యార్థినులు ఒకే గదిలో ఒకేసారి ఉరివేసుకుని మరణించడంపై అనేక అనుమానాలు రేకెత్తగా, కమిటీ నివేదిక లో  ఆ అంశాలేమీ లేవని తెలుస్తోంది. కాలేజీ నుంచి విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయాక విచారణ జరిపారనీ, దీంతో విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులేవీ వెలుగుచూడలేం దంటున్నారు.కాలేజీ ప్రిన్సిపాల్, వార్డెన్,  సిబ్బంది, పోలీసులు, పోస్టుమార్టం చేసిన డాక్టర్ల నుంచి వివరాలు సేకరించి  కమిటీ నివేదిక రూపొందించింది.

ఇద్దరు విద్యార్థినులు సాయంత్రం 5:36 ప్రాంతంలో మరణించారని పోస్టుమార్టం నివేదికలో ఉంది. అయితే 5:30 గంటలకు ఆ రూము వద్దకు మరో విద్యార్థిని వచ్చి వారిద్దరితో మాట్లాడి వెళ్లిందని, మరో అరగంట తరువాత ఇంకో విద్యార్థిని రూము వద్దకు వెళ్లగా ఇద్దరూ ఉరివేసుకొని కనిపించారని సిబ్బంది తెలిపినట్లు నివేదికలో పొందుపర్చారు.

అరగంట వ్యవధిలోనే వారిద్దరూ ఉరివేసుకొని ఉండవచ్చని కమిటీ పేర్కొంది. చనిపోయిన ఆరుగంటల లోపు పోస్టుమార్టం చేసి ఉంటే ఎప్పుడు చనిపోయారో సరిగ్గా తేలేదని, మరునాడు పోస్టుమార్టం చేయడం వల్ల డాక్టర్లు తమ నివేదికలో మృతి సమయంపై స్పష్టతనివ్వలేదని  పేర్కొన్నట్లు తెలుస్తోంది. రక్తంతో రాసినట్లున్న పేపర్‌లోని రాత ఎవరిది? రక్తం ఎవరిదన్న అంశాలపై ఫోరెన్సిక్ నివేదిక రావలసి ఉంది.

మరిన్ని వార్తలు