'వెంకయ్య దొడ్డిదారిన మంత్రి అయ్యారు'

10 Sep, 2016 21:59 IST|Sakshi
'వెంకయ్య దొడ్డిదారిన మంత్రి అయ్యారు'
హైదరాబాద్ : ఒక్కసారి కూడా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నిక కాకుండా పార్లమెంట్‌లో ప్రవేశించి.. మూడుసార్లు దొడ్డిదారిన కేంద్ర మంత్రి అయిన వెంకయ్యనాయుడికి కమ్యూనిస్టుపార్టీలను విమర్శించే హక్కు లేదని సీపీఐ నేత నారాయణ ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కమ్యూనిస్టుపార్టీలను పార్లమెంట్ కు రాకుండా బయట మాట్లాడే స్వేచ్ఛను ప్రజలు కల్పించారని వెంకయ్య చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతున్నామన్నారు. ఏనుగు చచ్చినా.. బతికినా వెయ్యి వరహాలేనని, కమ్యూనిస్టుపార్టీలు కూడా అంతేనన్నారు. ప్రజల ద్వారా లోక్‌సభకు ఎన్నిక కాలేక యాచకత్వం ద్వారా కర్ణాటక నుంచి రెండుసార్లు, రాజస్థాన్ నుంచి ఒకసారి వెంకయ్య రాజ్యసభకు నామినేట్ అయ్యారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
 
కమ్యూనిస్టుపార్టీలను వెటకారం చేయడం, ఎగతాళి చేయడం మంచి పద్ధతి కాదని, దానిని మానుకోవాలని హితవుపలికారు. చేతనైతే ప్రత్యేక హోదాను తెప్పించి చూపాలి తప్ప వెటకారాలు మానుకోవాలని సూచించారు. గతంలో రాజ్యసభలో ఏపీకి అయిదేళ్ల పాటు ప్రత్యేకహోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని చెబితే, కాదు కాదు పదేళ్లు కావాల్సిందేనని పట్టుబట్టిన వెంకయ్య ఇప్పుడు దానిని అమలు చేయించలేక మాట మార్చడాన్ని బట్టి ఆయనకు జ్ఞాపకశక్తి దెబ్బతిన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం ఆత్మహత్యకు ప్రధాని మోడీ కారణమని ఆరోపించారు. ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే యోచన మంచిదేనని అయితే మధ్యలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టకుండా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు.
>
మరిన్ని వార్తలు