రాజీనామా బాటలో గవర్నర్లు

18 Jun, 2014 08:23 IST|Sakshi
రాజీనామా బాటలో గవర్నర్లు

మార్పు తప్పదన్న సంకేతాలతో సిద్ధమవుతున్న వైనం
 
 సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో కొలువైన నరేంద్ర మోడీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్లను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కొందరు రాజీనామాల బాట పట్టగా.. కేరళ గవర్నర్ షీలాదీక్షిత్‌సహా మరికొందరు వైదొలిగేందుకు ససేమిరా అంటున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ బీఎల్ జోషి మంగళవారం ఉదయం తన రాజీనామాను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు పంపించారు. దీనిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపగా ఆయన ఆమోదించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యూపీ బాధ్యతలను ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీకి తాత్కాలికంగా అప్పగించారు.
 
 గాంధీ-నెహ్రూ కుటుంబానికి సన్నిహితునిగా పేరుపడిన 78 ఏళ్ల జోషి  పదవీకాలం కొద్ది నెలలక్రితం ముగియగా.. తిరిగి గవర్నర్‌గా నియమితులయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్లను తొలగించాలని, ముఖ్యంగా కేరళ గవర్నర్ షీలాదీక్షిత్, మరో నలుగురు గవర్నర్లను ఇంటికి పంపాలని మోడీ ప్రభుత్వం యోచిస్తున్నదని వార్తలు వెలువడ్డాయి. వీరిలో పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎం.కె.నారాయణన్, నాగాలాండ్ గవర్నర్ అశ్వినీకుమార్, గుజరాత్ గవర్నర్ కమలా బేణివాల్ ఉన్నట్టు సమాచారం. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను తొలగించాలన్న కొత్త ప్రభుత్వ ఉద్దేశాన్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి ఆయా గవర్నర్ల దృష్టికి తీసుకుపోయినట్టు సమాచారం. కొత్తవారిని నియమించేందుకు వీలుగా తప్పుకోవాలని సూచించినట్టు తెలిసింది.
 
 ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులై మరో రెండేళ్లలో పదవీకాలం ముగియనున్న వారిపై కేంద్రం నుంచి ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ల రాజీనామాల పర్వం ఆరంభమైంది. జోషి రాజీనామా చేయగా.. ఇదే సమయంలో కొందరు గవర్నర్లు మంగళవారం ఢిల్లీలో ఉండడం, రాష్ట్రపతిని కలవడంతో వారు సైతం రాజీనామా చేసినట్టు ఊహాగానాలొచ్చాయి. ఈ క్రమంలో కర్ణాటక గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్, అస్సాం గవర్నర్ జేబీ పట్నాయక్‌లు రాజీనామా చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే తాము రాజీనామా చేయలేదని వీరిద్దరూ స్పష్టం చేశారు. కర్ణాటక గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. అస్సాం గవర్నర్ జేబీ పట్నాయక్ పదవీకాలం మరో మూడు నెలల్లో ముగియనుంది.

 

మరోవైపు ఎంకే నారాయణన్(పశ్చిమబెంగాల్), మార్గరెట్ అల్వా (రాజస్థాన్), కమలా బేణివాల్ (గుజరాత్) రాజీనామా బాటలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రధాని మోడీని కలిసిన రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ అల్వా తన రాజీనామాపై చర్చించినట్టు ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు గుజరాత్ సీఎంగా మోడీ ఉన్న సమయంలో ఆయనతో సఖ్యతతో వ్యవహరించకపోవడం గవర్నర్ కమలా బేణివాల్ పదవికి ఎసరు తెచ్చింది.
 
 యూపీఏ ప్రభుత్వ బాటలోనే...
 
 గతంలో ఎన్డీఏ సర్కారు హయాంలో నియమితులైన గవర్నర్లను 2004లో యూపీఏ అధికారంలోకి రాగానే మార్చింది. తాజాగా ఎన్డీఏ సైతం యూపీఏ తరహాలో గవర్నర్ల మార్పునకు తెరతీసింది. యూపీఏ హయాంలో గవర్నర్ల నియామకం సక్రమంగా జరగలేదని, వారిలో ప్రతిభ ఆధారంగా గాక పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనుంగులైన వారికే అవకాశమిచ్చారంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఈ రాజీనామాల పర్వానికి తెరలేచింది. ఇదిలా ఉండగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) వంటి సంస్థల్లో సభ్యులుగా నియమితులైన రాజకీయ ప్రముఖులను కూడా తొలగించేందుకు ఎన్డీఏ సర్కారు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
 
 వదంతులపై స్పందించనన్న షీలా..
 
 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేరళ గవర్నర్‌గా నియమితులైన ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ తాను గవర్నర్ పదవికి రాజీనామా చేయనున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. వదంతులపై తాను స్పందించబోనని ఆమె వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర గవర్నర్ శంకరనారాయణన్ కూడా రాజీనామాపై ఆలోచిస్తున్నట్టు సమాచారం.
 
 నరసింహన్ కొనసాగింపు..
 
 మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో అనేక అంశాలు అపరిష్కృతంగా ఉండడంతో ఆయన్ను మార్చే అవకాశాలు తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది.
 
 బీజేపీ సీనియర్లకు అవకాశం
 
 ప్రధాని నరేంద్రమోడీ కేబినెట్‌లో చోటు దక్కని బీజేపీ సీనియర్ నాయకులను ఆయా రాష్ట్రాల గవర్నర్లుగా పంపి సంతృప్తి పర్చాలన్న యోచనలో అధిష్టానం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ సీనియర్ నేతలైన ఎం.ఎం.జోషి, లాల్జీ టాండన్, వీకే మల్హోత్రా, కల్యాణ్‌సింగ్, శాంతకుమార్‌తోపాటు బీసీ ఖండూరీ పేర్లు ఇప్పటికే పరిశీలనలో ఉన్నాయి. అదేవిధంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించి కేబినెట్‌లో ప్రాధాన్యం లభించని నాయకులను సైతం గవర్నర్లుగా పంపే యోచనలో బీజేపీ ఉందని సమాచారం.
 
 అనైతికమన్న కాంగ్రెస్, సీపీఎం, ఎస్పీ
 
 ఎన్డీఏ ప్రభుత్వ చర్యను కాంగ్రెస్, సీపీఎంలు తప్పుపట్టాయి. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని, అనైతికమని మండిపడ్డాయి. దీనిని రాజకీయ ప్రతీకార చర్యగా, నిరంకుశమైన చర్యగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ అభివర్ణించారు. రాజ్యాంగపరంగా గవర్నర్ల వ్యవస్థకున్న గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించడం సరికాదని సూచించారు. గత ప్రభుత్వంలో నియమితులయ్యారన్న ఏకైక రాజకీయ కారణం తప్ప గవర్నర్ల తొలగింపు వెనుక మరొక కారణం కనిపించడం లేదని సీపీఎం నేత సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు.

 

గవర్నర్ల మార్పులో ఏ మార్పు అయినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభిమతానికి అనుగుణంగా ఉండాలని హితవు పలికారు. ఎన్డీఏ ప్రభుత్వ యోచన సరికాదని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి నరేష్ అగర్వాల్ అన్నారు. దేశాన్ని కాషాయీకరణ చేయడానికి ఇది నాందిగా పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలకు చెందినవారిని గవర్నర్లుగా పంపేందుకు చేస్తున్న ప్రయత్నమిదని తప్పుపట్టారు. బీజేపీ నేతలు మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించారు. దీనిపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ స్పందిస్తూ.. యూపీఏ నియమించిన గవర్నర్ల జాబితాలో తానున్నట్లయితే రాజీనామా చేసేవాడినని వ్యాఖ్యానించారు.

 

 

>
మరిన్ని వార్తలు