‘టైమ్‌’ జాబితాలో మోదీ

21 Apr, 2017 00:44 IST|Sakshi
‘టైమ్‌’ జాబితాలో మోదీ

పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మకూ స్థానం
అత్యంత ప్రభావశీలుర జాబితాలో భారత్‌ నుంచి వీరిద్దరికే చోటు


న్యూయార్క్‌: టైమ్‌ మేగజీన్‌ ఏటా ప్రచురించే ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన వందమంది వ్యక్తుల జాబితాలో భారత్‌ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ మాత్రమే చోటు సంపాదించారు. ఈ ఏడాదికి సంబంధించిన జాబితాను టైమ్‌ మేగజీన్‌ గురువారం విడుదల చేసింది. ఆయా రంగాల్లో మార్గదర్శకులుగా నిలిచినవారు, కళాకారులు, నేతలు, ప్రముఖులకు ఈ జాబితాలో చోటు లభించింది. జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, బ్రిటన్‌ ప్రధానమంత్రి థెరెసా మే పేర్లు కూడా ఉన్నాయి.

ట్రంప్‌ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త కుష్నెర్‌లకు ఇందులో చోటు లభించడం విశేషం. జాబితాలో ఇంకా పోప్‌ ఫ్రాన్సిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్, అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజెస్, వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజే, వివాదాస్పద ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగొ డ్యుటెర్టె పేర్లు కూడా ఉన్నాయి. కాగా, టైమ్‌ మేగజీన్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ రీడర్స్‌ పోల్‌లో మోదీకి ఓట్లేవీ పడకపోయినా.. ‘టైమ్‌’ ఎడిటర్లు ఎంపిక చేసిన వందమంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో  ఆయన చోటు పొందడం విశేషం.

మోదీ ప్రభ మసకబారలేదు
ఈ ‘టైమ్‌’ సంచికలో  మోదీ ప్రొఫైల్‌ను రచయిత పంకజ్‌ మిశ్రా రాశారు. అందులో ‘గుజరాత్‌లో గోధ్రా అనంతరం చెలరేగిన ముస్లిం వ్యతిరేక హింసాకాండ నేపథ్యంలో ఆయనకు అమెరికా వీసా నిరాకరించింది.  స్వదేశంలో ఆయన రాజకీయ అస్పృశ్యతను ఎదుర్కొన్నారు. సంప్రదాయ మీడియాను తోసిరాజని.. ప్రపంచీకరణ కారణంగా దెబ్బతిన్నామని భావిస్తున్న అణగారిన వర్గాల ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరుచుకున్నారు. అవినీతిపరులు, స్వార్థపరుల్ని ఏరివేసి భారత్‌ను మరోసారి సమున్నత స్థానంలో నిలుపుతానని వాగ్దానం చేయడం ద్వారా సామాన్య ప్రజలకు చేరువయ్యారు’ అని వివరించారు. మోదీ ప్రభ మసకబారలేదని, అస్తిత్వ భయాలు, సాంస్కృతిక అభద్రతలతో కొట్టుమిట్టాడే ప్రజలను రాజకీయంగా చేరదీసే కళలో ఆయన ఆరితేరిపోయారని మిశ్రా అభిప్రాయపడ్డారు.

పెద్ద నోట్ల రద్దుతో..: పేటీఎం వ్యవస్థాపకుడు శేఖర్‌ శర్మ(43) గురించి ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నిలేకని వివరిస్తూ.. నోట్లరద్దుతో నెలకొన్న పరిస్థితులను శర్మ తనకు అనుకూలంగా మలుచుకోగలిగారన్నారు. నోట్ల రద్దు అనంతర పరిస్థితుల్లో శర్మకు చెందిన డిజిటల్‌ చెల్లింపుల స్టార్టప్‌.. ‘పేటీఎం’ ఊపందుకుందని తెలిపారు.

మరిన్ని వార్తలు