కాంగ్రెస్సే అత్యంత విషపూరితం: నరేంద్రమోడీ

25 Nov, 2013 06:34 IST|Sakshi
కాంగ్రెస్సే అత్యంత విషపూరితం: నరేంద్రమోడీ

50 ఏళ్ల పాటు విషంలాంటి అధికారాన్ని రుచి చూసిందెవరు?
రాహుల్ తన ఇంటి సమీపంలోని పేదలకు ఏంచేశారు?

 
 బన్స్‌వారా/చిత్తోర్‌గఢ్(రాజస్థాన్): కాంగ్రెస్ కంటే విషపూరిత పార్టీ మరేదీ లేదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ‘విషపూరిత అధికారం’లో అర్ధశతాబ్దం పాటు కాంగ్రెస్ పెరుగుతూ వచ్చిందన్నారు. బీజేపీ నేతల ఆలోచనల్లోనే విషముందంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై మోడీ.. ఆదివారం రాజస్థాన్‌లోని బన్స్‌వారా, చిత్తోర్‌గఢ్, అంట, కోటలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో విరుచుకుపడ్డారు. యూపీఏ, రాజస్థాన్ ప్రభుత్వ వైఫల్యాలను, కాంగ్రెస్ నైజాన్ని కడిగి పారేశారు. కాంగ్రెస్ పేదలను ఓటు బ్యాంకుగానే చూస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఒక చాయ్‌వాలా, ఒక పాన్‌వాలా, ఒక కూలీ, ఒక రైతు ప్రధాని కాగలరని చెప్పారు. ‘‘అధికారం విషంలాంటిదని తనకు తన తల్లి చెప్పినట్లు రాకుమారుడు (రాహుల్‌గాంధీ) ఒకసారి జైపూర్‌లో చెప్పారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ ఈ దేశాన్ని 50 ఏళ్లపాటు పాలించింది. మరి దీర్ఘకాలంపాటు ఆ విషాన్ని రుచి చూసినది ఎవరు?.. కాంగ్రెస్’ అని మోడీ అన్నారు.
 
 కాంగ్రెస్ కంటే విషపూరిత పార్టీ లేదన్నారు. మీడియా ముందు పేదల గురించి మాట్లాడే రాహుల్ ఢిల్లీలోని తన నివాసానికి సమీపంలో ఉండే మురికివాడలోని ప్రజలకు ఏమీ చేయలేదేమని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ధరలను అదుపు చేస్తామంటూ 2009 ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కాంగ్రెస్ తేలికగా మర్చిపోయిందని దుయ్యబట్టారు. ద్రవ్యోల్బణాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజలు మర్చిపోతారు కానీ, క్షమించరని కాంగ్రెస్‌ను, యూపీఏను హెచ్చరించారు. ముగ్గురు నేతలు మన్మోహన్ సింగ్,  సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ రాజస్థాన్‌లో ప్రచారారినికి వచ్చినా ఒ క్కరూ ద్రవ్యోల్బణంపై మాట్లాడలేదని నిలదీశారు.

మరిన్ని వార్తలు