గోపీనాథ్ ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు!

5 Jun, 2014 17:49 IST|Sakshi
గోపీనాథ్ ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు!

న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి గోపీనాథ్ ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఆయన మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్లు అధికం కావడంతో ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ  నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తు అంశంపై మోడీ త్వరలో తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనిపై ప్రజలకు ఏమైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  ప్రజానేతగా గుర్తింపు ఉన్న ముండే మృతి మాత్రం పార్టీకి తీరని లోటేనన్నారు.

 

తొలిసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టిన మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు ముండే  మంగళవారం ఉదయం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ముంబై వెళ్లడానికి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు ముండే తన కారులో (మారుతి సుజుకి ఎస్‌ఎక్స్4) వెళ్తుండగా పృథ్వీరాజ్ రోడ్డు-తుగ్లక్ రోడ్డు సర్కిల్ వద్ద 6:20 గంటలకు మరో కారు (టాటా ఇండికా) పక్క వైపు నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు