తరుణ్ తేజ్పాల్పై బిగుస్తున్న ఉచ్చు

22 Nov, 2013 12:03 IST|Sakshi
తరుణ్ తేజ్పాల్పై బిగుస్తున్న ఉచ్చు

న్యూఢిల్లీ : తెహల్కా మేగజైన్‌ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తన వద్ద పనిచేసే మహిళా జర్నలిస్ట్‌పై లైంగిక దాడి జరిపిన అంశంపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్‌ శుక్రవారం ఆదేశించింది.  గోవా పోలీసులకు లేఖ రాసిన మహిళా కమిషన్‌... వెంటనే తేజ్‌పాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని కోరింది. కేసును సుమెటోగా స్వీకరించాలని సూచించింది.   జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ...ఈరోజు ఉదయం బాధితురాలిని  కలిసి వివరాలు తెలుసుకున్నారు.

కాగా గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్‌లో పది రోజుల కిందట తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సంస్థలోని  మహిళా జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు దుమారం రేపిన విషయం తెలిసిందే. హోటల్‌లోని ఓ లిఫ్టులోకి లాగి తేజ్‌పాల్ తనను వేధించారంటూ బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఎడిటర్ పదవికి ఆరునెలలపాటు దూరంగా ఉండనున్నట్లు తేజ్‌పాల్ బుధవారం షోమాకు పంపిన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.

అటు గోవా ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఘటనపై విచారణ ప్రారంభించి వివరాలు సేకరించారు. లైంగికదాడి జరిపి పత్రిక ఎడిటర్‌గా ఆరునెలలు తప్పుకోవడమే శిక్షగా పరిగణించాలంటే కుదరదని ఇప్పటికే రాజకీయ పక్షాలు స్పష్టం చేశాయి. తేజ్‌పాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రాధమిక విచారణలో తేజ్‌పాల్‌ లీలలు వెలుగుచూస్తుండటంతో ఏ క్షణానైనా ఆయన్ను అరెస్ట్‌ చేస్తారని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు