రాష్ట్రంలో ‘నిక్’కు ఓకే: రవిశంకర్ ప్రసాద్

19 Feb, 2016 02:30 IST|Sakshi
రాష్ట్రంలో ‘నిక్’కు ఓకే: రవిశంకర్ ప్రసాద్

* విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో పోస్టల్ హబ్‌లు
* అమరావతిలో పోస్టల్ ఎక్స్ఛేంజ్

సాక్షి, విశాఖపట్నం: ‘‘ఏపీలో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్(ఎన్‌ఐసీ) ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ఏర్పాటు చేశాం. ఐటీఐఆర్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తాం. రాష్ర్టంలోని పోస్టాఫీసులన్నింటినీ కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురావడంతోపాటు డిజిటలైజ్  చేస్తాం. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో పోస్టల్ హబ్స్ ఏర్పాటు చేస్తాం. ఈ-కామర్స్ పోస్టల్ పార్సిల్ విభాగాన్ని గుంటూరులో ఏర్పాటు చేస్తున్నాం.

రాజధాని అమరావతిలో కొత్తగా పోస్టల్ ఎక్స్ఛేంజ్ మంజూరు చేస్తున్నాం’’ అని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో రూ.80.02 కోట్లతో ఏర్పాటు చేయనున్న సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్(సమీర్) కేంద్రానికి విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.

అనంతరం విశాఖలోని సిరిపురం జంక్షన్ వద్ద ఏర్పాటు చేయనున్న ఇంక్యుబేషన్ సెంటర్ కోసం ఎస్‌టీపీఐ డెరైక్టర్ సి.వి.డి.రామ్‌ప్రసాద్, వుడా వీసీ బాబూరావునాయుడులు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రుల సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడారు.

ఎన్నిసార్లు పర్యటిస్తే అన్ని ప్రాజెక్టులు: తాను ఎన్నిసార్లు ఏపీలో పర్యటిస్తే అన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చే లక్ష్యంతో పని చేస్తున్నానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వర్సిటీలను కొన్ని శక్తులు కలుషితం చేస్తున్నాయని ఆరోపించారు. సీఎం బాబు మాట్లాడుతూ...  ఏపీ గ్రోత్ రేట్ 10.5 శాతంగా ఉందన్నారు.
 
బీపీఓ సేవలను విశాఖకు విస్తరించండి
బిజినెస్ ప్రొసెసింగ్ ఔట్ సోర్సింగ్(బీపీవో) సేవలను విశాఖకు విస్తరించాలని ఐటీ శాఖ అధికారులను రవిశంకర్ ప్రసాద్ ఆదేశించారు. ఆయన గురువారం విశాఖపట్నంలో తపాలా, బీఎస్‌ఎన్‌ఎల్, ఐటీ, ఎన్‌ఐసీ, ఎలక్ట్రానిక్స్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.  అమరావతిలో జూన్ నాటికి అధునాతన టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విశాఖపట్నంలో అధునాతన పార్సిల్ హబ్ ఏర్పాటు చేయాలన్నారు.

మరిన్ని వార్తలు