బందరు వద్ద మెరైన్ అకాడమీ

14 Nov, 2013 05:11 IST|Sakshi
బందరు వద్ద మెరైన్ అకాడమీ

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరో జాతీయస్థాయి శిక్షణ సంస్థ రాబోతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం తీర ప్రాంతంలో జాతీయ మెరైన్ అకాడమీ(ఎన్‌ఎంఏ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. మచిలీపట్నం సమీపంలోని పెద్దపట్నం తీరప్రాంతంలో 300 ఎకరాలలో ఎన్‌ఎంఏ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందించారు. కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి అధికారులు డిసెంబర్‌లో స్వయంగా వచ్చి అకాడమీ ఏర్పాటు కోసం ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించనున్నారు. తర్వాత తుది ఆమోదం తెలపనున్నారు. ఏర్పాటు ఖాయమైతే దేశంలో మెరైన్ పోలీసులకు శిక్షణ అందించే మొట్టమొదటి అకాడమీ ఇదే అవుతుంది.
 
  పాకిస్థాన్ నుంచి సముద్రమార్గం ద్వారా దేశంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించిన నేపథ్యంలో తీర ప్రాంత భద్రతపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ దృష్టిసారించింది. అలాగే దేశంలో అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించిన మావోయిస్టులకు కూడా సముద్ర మార్గం ద్వారా ఆయుధాలు అందుతున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీ.కు ఒక మెరైన్ పోలీస్‌స్టేషన్ వంతున ఇప్పటి వరకూ 21 స్టేషన్లు ఏర్పాటయ్యాయి. తీరప్రాంతంతోపాటు సముద్ర నీటిలోనూ నిఘా కోసం మరబోట్లను మెరైన్ పోలీసులకు అందించారు.
 
 ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు 30 మంది చొప్పున 600లకుపైగా సిబ్బంది ఉన్నారు. మెరైన్ సిబ్బందికి కోస్ట్‌గార్డ్, నేవీ విభాగాల ద్వారా తాత్కాలిక శిక్షణ అందిస్తున్నారు. అయితే పూర్తిస్థాయి శిక్షణ అందించేందుకు ప్రత్యేకంగా అకాడమీలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్ నుంచి కేరళ వరకూ తూర్పు తీర ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల మెరైన్ పోలీసులకూ మచిలీపట్నం వద్ద ఏర్పాటు చేయనున్న ఎన్‌ఎంఏలో శిక్షణ అందించనున్నారు. పశ్చిమ తీర ప్రాంతంలో మరో జాతీయ మెరైన్ అకాడమీ ఏర్పాటును కూడా కేంద్రం పరిశీలిస్తోంది. మన రాష్ట్రంలో భూమి కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ప్రతిపాదనలు అందించడంతో మొదటి అకాడమీ ఇక్కడే ఏర్పడబోతోంది.
 
 300 ఎకరాల కేటాయింపునకు ప్రభుత్వం ఓకే
 మచిలీపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలోని పెద్దపట్నం వద్ద సముద్రానికి ఆనుకుని ఉన్న 300 ఎకరాల భూమిని ఎన్‌ఎంఏకి కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి బృందం డిసెంబర్‌లో ఈ భూములను పరిశీలిస్తుందని, అనంతరం ఎన్‌ఎంఏ ఏర్పాటుకు పూర్తిస్థాయి ఆమోదం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. విశాఖపట్నంలో కోస్ట్‌గార్డ్, నేవీ విభాగాలు అందుబాటులో ఉండటం, దగ్గర్లో గన్నవరం విమానాశ్రయం ఉండటం వల్ల ఎన్‌ఎంఏకి శిక్షకులు వచ్చేందుకు కూడా సులువవుతుందని కేంద్ర హోంశాఖ భావిస్తోంది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు