జాతీయ సంస్థలకు ‘భూగ్రహణం’!

19 Aug, 2015 01:02 IST|Sakshi
జాతీయ సంస్థలకు ‘భూగ్రహణం’!

అ ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థల ఏర్పాటుపై శ్రద్ధ పెట్టని రాష్ట్ర ప్రభుత్వం
విభజన చట్టంలో పేర్కొన్న 12 సంస్థల ఏర్పాటుకు ముందుకొచ్చిన కేంద్రం
ఐఐఎంకు, ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌లకే భూములు కేటాయింపు
ఎయిమ్స్, కస్టమ్స్ అకాడెమీలకు ఇచ్చిన భూములు వివాదాస్పదం
మిగతా వాటికి భూముల ఊసెత్తని బాబు సర్కారు
భూములివ్వకపోవడం వల్ల కేంద్ర నిధులూ మురిగిపోయే అవకాశం

 
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం కారణంగా రాష్ట్రానికి ఇప్పటికీ ప్రత్యేక హోదా రాకపోగా, ఇప్పుడు కేంద్రం ఏర్పాటు చేస్తానన్న జాతీయ సంస్థలనూ కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు కేంద్రం సిద్ధ పడినా, రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల అవి కూడా చేజారిపోయే పరిస్థితి నెలకొంది. ప్రైవేటు సంస్థలకు వేలాది ఎకరాలు కట్టబెట్టడానికి సిద్ధమవుతున్న చంద్రబాబునా ప్రభుత్వం.. ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు మాత్రం భూములివ్వడానికి మాత్రం ఆసక్తి చూపడంలేదు. దీనివల్ల ఈ సంస్థలకు కేంద్రం కేటాయించిన నిధులు మురిగిపోవడంతోపాటు రాష్ట్ర విద్యా రంగానికి, విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఎన్నిమార్లు కోరినా భూములివ్వకుండా తాత్సారం చేస్తున్న రాని రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన జాతీయ సంస్థలు వాటి ప్రణాళికలను మార్చుకుంటున్నాయి. కొన్ని సంస్థలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి.

విభజన నేపథ్యంలో రాష్ట్రంలో 12 జాతీయ సంస్థలను ఏర్పాటు చేస్తామని ‘పునర్విభజన చట్టం’లో కేంద్రం హామీ ఇచ్చింది. అన్ని జాతీయ సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని సెప్టెంబరు 4న శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖపట్నంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, కాకినాడలో పెట్రోలియం యూనివర్సిటీ, పశ్చిమ గోదావరి జిల్లాలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), తిరుపతిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్), అనంతపురంలో సెంట్రల్ యూనివర్శిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడెమీ, కర్నూలులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), రాజధాని ప్రాంతం (గుంటూరు, విజయవాడ)లో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్), వ్యవసాయ విశ్వవిద్యాలయం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐడీఎం) ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చింది. వీటికి భూములు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరింది. గత 15 నెలల్లో మూడు సంస్థలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. విశాఖ జిల్లా గంభీరంలో ఐఐఎంకు 300 ఎకరాలు, చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక, పంగపల్లి వద్ద ఐఐటీకి 460 ఎకరాలు, ఐఐఎస్‌ఈఆర్‌కు 434 ఎకరాలు కేటాయించింది. ఎయిమ్స్, కస్టమ్స్ అకాడెమీలకు భూముల కేటాయించినా, అవి వివాదాస్పదమయ్యాయి. మిగతా వాటికి భూమిని కేటాయించలేదు.

 ఎన్‌డీఆర్‌ఎఫ్ భూమిలో ఎయిమ్స్
 ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ఏర్పాటుకు గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద 172 ఎకరాలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. అదే భూమిలో 40 ఎకరాలను ఎన్‌డీఆర్‌ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్)కు 2012లోనే కేటాయించారు. ఆ భూమిలో ఎన్‌డీఆర్‌ఎఫ్ భవనాల నిర్మాణాన్ని కూడా ప్రారంభించింది. దీంతో ఇక్కడ ఎయిమ్స్ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. దీనిపై ఎయిమ్స్ ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్‌ఐడీఎం ప్రధాన కేంద్రాన్ని విజయవాడ వద్ద ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. కానీ భూమిని కేటాయించకపోవడంతో అది ఢిల్లీకి తరలిపోతోం ది. క్యాంపస్‌ను  విజయవాడలో నెలకొల్పాలని తాజాగా కేంద్రం నిర్ణయించింది. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద కస్టమ్స్ అకాడెమీకి 140 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. అదే భూమిని అంతకు ముందే బీఈఎల్ (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్)కు కూడా కేటాయించారు. దాంతో రెండు సంస్థలూ అక్కడ భవనాల నిర్మాణం చేపట్టలేని దుస్థితి నెలకొంది. ఎన్‌ఐటీని తొలుత ఏలూరులో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చివరకు తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పింది. దీనికి భూమిని కేటాయించలేదు. గిరిజన, పెట్రోలియం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్శిటీ, ఐఐఐటీలకూ భూమి కేటాయింపులను కనీసం పట్టించుకోలేదు. అనంతపురం జేఎన్‌టీయూలో సెంట్రల్ యూనివర్శిటీ తరగతులను ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించినా, మౌలిక సదుపాయాలు లేక తరగతులు ప్రారంభం కావడం సందిగ్ధమే.

మురిగిపోతున్న నిధులు : ప్రభుత్వం భూములు కేటాయించకపోవడంతో కేంద్రం జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు కేటాయిం చిన నిధులు కూడా మురిగిపోతున్నాయి. ఐఐ టీ ఏర్పాటుకు 2014-15 బడ్జెట్‌లో కేంద్రం రూ.100 కోట్లు కేటాయించింది. భూములు ఇవ్వకపోవడంతో ఆ నిధులు మురిగిపోయా యి. 2015-16 బడ్జెట్‌లో ఐఐటీకి రూ.40 కో ట్లు, ఎన్‌ఐటీకి రూ.40 కోట్లు, ఐఐఎంకు రూ. 40 కోట్లు, ఐఐఎస్‌ఈఆర్‌కు రూ.40 కోట్లు, ఐఐఐటీకి రూ.45 కోట్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.75 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.కోటి, సెంట్రల్ యూనివర్శిటికీ రూ.కోటి, పెట్రోలియం వర్సిటీకి రూ. కోటి కేంద్రం కేటాయించింది.
 
ఎన్‌ఐడీఎం హుళక్కే!

న్యూఢిల్లీ: జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌ఐడీఎం) రాష్ట్రాన్ని ఊరించి ఉసూరుమనిపించేలా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఎన్‌ఐడీఎం ప్రాంతీయ కేంద్రంతో సరిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ఎన్‌ఐడీఎం ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పుతామని రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న కేంద్రప్రభుత్వం ఇప్పుడు మాటమార్చి ప్రాంతీయ కేంద్రంతో సరిపుచ్చే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయమై కేంద్ర హోంశాఖ అధికారిని ‘సాక్షి’ సంప్రదించగా రాష్ట్రానికి ఎన్‌ఐడీఎం ప్రాంతీయ కేంద్రంతో సరిపెట్టాలని తాజాగా సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం వాస్తవమేనని ధ్రువీకరించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు