ఉరీ ఉగ్రదాడి ఎందుకు జరిగిందంటే..

24 Sep, 2016 15:14 IST|Sakshi
ఉరీ ఉగ్రదాడి ఎందుకు జరిగిందంటే..

లండన్: కశ్మీర్ లోని ఉరీ సైనిక స్థావరంపై దాడిచేసి 18 మంది జవాన్లను చంపిన ఉగ్రవాదులు పాకిస్థానీలే అని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) పలు ఆధారాలు సేకరించింది. ఆ మేరకు ఉరీ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల డీఎన్ఏ నమూనాలు, వేలిముద్రలు, దాడికి ఉపయోగించిన ఆయుధాలు, ఆహార పదార్థాలు ఇతరత్రా వివరాలన్నింటినీ పూసగుచ్చినట్లు పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్కు సమర్పించింది. ఆ వివరాలను ఇస్లామాబాద్ కు చేరవేసిన ఆయన తమ ప్రభుత్వ సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. ఈలోపే అసలు ఉరీ దాడి ఎందుకు జరిగిందో తనదైన శైలిలో భాష్యం చెప్పారు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.

ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని నేరుగా లండన్ వెళ్లిన నవాజ్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గడిచిన రెండు నెలలుగా కశ్మీర్ లో నెలకొన్న ఉద్రిక్తతలకు కొనసాగింపుగానే ఉరీ ఉగ్రదాడి జరిగిఉండొచ్చని అన్నారు. 'భారత సైన్యం అణిచివేతతో ఎంతో మంది కశ్మీరీలు తమ ఆప్తులను కోల్పోయారు. లెక్కకుమించి యువకులు కళ్లు పోగొట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగానే ఉరీలో దాడి జరిగింది. ఎప్పటిలాగే భారత్.. పాకిస్థాన్ వైపే వేలెత్తిచూపుతోంది. సరైన ఆధారాలు లేకుండా పాకిస్థాన్ ను నిందించడం ఆ (భారత్)దేశానికున్న చారిత్రక అలవాటు. ఉరీలో చనిపోయిన నలుగురు ఉగ్రవాదులు పాకిస్థాన్ లో తయారైన గ్రెనేడ్లు, ఆహారం వినియోగించారని ఆరోపిస్తున్నారు. కానీ రెండు నెలల కిందట బుర్హాన్ వని చనిపోయినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఎలాంటి సంబంధాలు ఎనసాగటంలేదని గుర్తుంచుకోవాలి' అని షరీఫ్ వ్యాఖ్యానించారు.

ఉరీలో దాడికి పాల్పడింది ముమ్మాటికీ పాకిస్థానీలేనని అందుకు సంబంధించిన ఆధారాలన్నింటినీ పాక్ ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వికాస్ స్వరూప్ చెప్పారు. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుపెట్టిన కొద్ది గంటలకే వారి నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలు, ఇతరత్రా ఆధారాలను ఢిల్లీలోని పాక్ కమిషనర్ కు అందించారు. పఠాన్ కోట్ సహా ఇతర దాడుల్లోనూ పాక్ హస్తం ఉందనే ఆధారాలు సైతం సమర్పించారు. వీటిపై ఇస్లామాబాద్ అధికారికంగా స్పందించాల్సిఉంది. ఈలోపే నవాజ్ షరీఫ్ భాష్యం చెప్పడంతో ఉరీదాడిపై పాక్ అభిప్రాయం వెల్లడైనట్లైంది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు