-

‘మావోయిస్టుల అసలురూపం బయటపడింది’

16 Mar, 2017 09:56 IST|Sakshi
‘మావోయిస్టుల అసలురూపం బయటపడింది’

రాయ్‌పూర్‌: తీవ్రవాదం, ఉగ్రవాదం అనేవి ఒకే నాణేనికి ఉండే బొమ్మా బొరుసుల్లాంటివని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే సుపరిపాలనే మార్గమని ఆయన సూచించారు. ‘హిందూ మహా సముద్ర ప్రాంతంలో ఉగ్రవాదం’అనే అంశంపై ‘ఇండియా ఫౌండేషన్‌’సంస్థ ఢిల్లీలో ఒక సదస్సును నిర్వహించింది.

రాయ్‌పూర్‌లోని తన అధికారిక నివాసం నుంచి రమణ్‌ సింగ్‌ ఈ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ప్రజాస్వామ్య ఆకాంక్షల ద్వారా పరిపాలనా వ్యవస్థను బలహీనం చేయడం, భయాన్ని వ్యాపింపజేసి సమాజాన్ని దోచుకోవడమే నక్సలైట్ల లక్ష్యమని రమణ్‌సింగ్‌ అన్నారు.

‘మావోయిస్టుల అసలురూపం బయటపడింది. వారు బస్తర్‌లో విద్య, ఆరోగ్యం, రహదారులు, కమ్యూనికేషన్‌ సాధనాలు తదితరాలను నాశనం చేశారు’అని రమణ్‌ సింగ్‌ పేర్కొన్నారు. నక్సల్స్‌ ప్రాబల్యం అధికంగా ఉన్న బస్తర్‌ డివిజన్‌లో సమస్యను అధిగమించేందుకు తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందనీ, అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తోందని రమణ్‌సింగ్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు