అటవీ సిబ్బందిని రోజంతా నిర్బంధించిన నక్సల్స్

8 Aug, 2015 23:20 IST|Sakshi

పాల్వంచ రూరల్(ఖమ్మం): హరితహారం కార్యక్రమంలో భాగంగా పోడు భూములలో మొక్కలు నాటేందుకు వెళ్లిన వన్యప్రాణుల సంరక్షణ విభాగం చాతకొండ రేంజ్‌కి చెందిన ఇద్దరు సిబ్బందిని, మరో 20 మంది కూలీలను న్యూడెమోక్రసీ సాగర్ దళం సాయుధ నక్సల్స్ నిర్బంధించి 24 గంటల తర్వాత వదిలేశారు. ఇద్దరు సిబ్బందిని మాత్రం విపరీతంగా కొట్టారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వన్యప్రాణుల సంరక్షణ విభాగం చాతకొండ రేంజ్ మర్కోడులో వాచర్‌గా పనిచేస్తున్న ఎం.రమేష్, ఒడిశా రాష్ట్రానికి చెందిన 20 మంది కూలీలతో కిచన్‌పల్లి అటవీప్రాంతంలో రెండు రోజులుగా మొక్కలను నాటుతున్నారు. గురువారం సాయంత్రం తొమ్మిది మంది నక్సల్స్ అక్కడి వచ్చారు.

మొక్కలను నాటొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాచర్‌తోపాటు కూలీలను చిన్నగుట్టపైకి తీసుకెళ్లి నిర్బంధించారు. సెక్షన్ ఆఫీసర్ టీబీ నాగేశ్వరరావు శుక్రవారం మొక్కలునాటే ప్రదేశానికి వె ళ్లగా ఆయనను కూడా బంధించారు. గతంలో అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకొని వదలలేదని కోపంతో తనను తుపాకి మడమలతో చితకబాదారని ఆయన తెలిపారు. 22 మందిని ఒక రోజు మొత్తం గుట్టపైన ఉంచిన తర్వాత శుక్రవారం రాత్రి వదిలేశారని తెలిపారు. సాగర్ దళంపై గుండాల మండలం ఆళ్లపల్లిపోలీసుస్టేషన్‌లో డీఎఫ్‌వో ఆదేశాల మేరకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.

మరిన్ని వార్తలు