ఎన్‌సీసీ-గాయత్రి ప్రాజెక్టులో సెంబ్‌కార్ప్‌కు వాటాలు

4 Feb, 2014 02:18 IST|Sakshi
ఎన్‌సీసీ-గాయత్రి ప్రాజెక్టులో సెంబ్‌కార్ప్‌కు వాటాలు

45% వాటాలు కొంటున్న సింగపూర్ కంపెనీ
 హైదరాబాద్ , బిజినెస్ బ్యూరో: ఎన్‌సీసీ పవర్ ప్రాజెక్టు (ఎన్‌సీసీపీపీ)లో 45% వాటాలను సింగపూర్ సంస్థ సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి ఇరువర్గాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎంత మొత్తానికి ఈ వాటాలు విక్రయించేదీ కంపెనీ వెల్లడించలేదు.  డీల్ ముగిసిన తర్వాత ఎన్‌సీసీపీలో సెంబ్‌కార్ప్‌కి 45 శాతం, ఎన్‌సీసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ (ఎన్‌సీసీఐహెచ్‌ఎల్)కి 55 శాతం వాటాలు ఉంటాయి. నియంత్రణ సంస్థల అనుమతులు బట్టి సెంబ్‌కార్ప్ మరో 20 శాతం దాకా వాటాలు పెంచుకునే దిశగా కూడా ఎన్‌సీసీపీపీ ఒప్పందం కుదుర్చుకోనుంది.
 
  ఎన్‌సీసీ అనుబంధ సంస్థ అయిన ఎన్‌సీసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ (ఎన్‌సీసీఐహెచ్‌ఎల్), గాయత్రి ఎనర్జీ వెంచర్స్ కలిసి ఎన్‌సీసీపీపీని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఇది నెల్లూరులోని కృష్ణపట్నంలో 1,320 మెగావాట్ల సామర్ధ్యంతో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటును నిర్మిస్తోంది. ఎన్‌సీసీసీపీ ప్రాజెక్టు పనులు దాదాపు 30 శాతం పూర్తయ్యాయి. ఇది 2016 ప్రారంభంలో అందుబాటులోకి రాగలదని అంచనా.  భారీ ప్రాజెక్టుల అమల్లో అంతర్జాతీయంగా అపార అనుభవం ఉన్న సెంబ్‌కార్ప్ తమ భాగస్వామి కావడం సంతోషకర పరిణామమని  ఎన్‌సీసీ ఎండీ ఎ. రంగ రాజు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు