బెంగళూరు ఘటనపై ఆ ఇద్దరికీ సమన్లు!

3 Jan, 2017 16:17 IST|Sakshi

బెంగళూరు/న్యూఢిల్లీ: బెంగళూరులో మహిళలు బహిరంగంగా లైంగిక వేధింపులకు గురైన ఘటనపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వరకు, ఎస్పీ ఎమ్మెల్యే అబూ అజ్మీకి జాతీయ మహిళ కమిషన్‌ (ఎన్సీడబ్ల్యూ) షాక్‌ ఇచ్చింది. ఆ ఇద్దరు నేతలకు సమన్లు జారీచేసింది. 'పార్టీలకతీతంగా కొందరు వ్యక్తులు జుగుప్సకరమైన వ్యాఖ్యలు చేశారు. ఉన్నతస్థానంలో ఉన్నవారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. దేశం ఎటువైపు వెళ్తున్నట్టు?' అని ఎన్సీడబ్ల్యూ చీఫ్‌ లలితా కుమారమంగళం అన్నారు.

బెంగళూరులో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా పలువురు మహిళలపై ఆకతాయిలు బహిరంగంగా రెచ్చిపోయి.. లైంగికంగా తాకడం, వేధించడం వంటి వికృత చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందిస్తూ యువత పాశ్చాత్య ధోరణిని అవలంబిస్తుండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, యువతులు కూడా పాశ్చాత్య దుస్తులు వేసుకొని వేడుకల్లో పాల్గొన్నారని, ఇలాంటి ఘటనలు జరగడం మామూలేనని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఎన్సీడబ్ల్యూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు దేశ మహిళలకు ఆయన క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది.

'ఒక హోంమంత్రి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్ణకరం, ఆమోదనీయం కాదు. వేడుకల సందర్భంగా మహిళలు పాశ్చాత్య దుస్తులు వేసుకున్నంత మాత్రాన భారతీయ పురుషులు అదుపుతప్పి రెచ్చిపోతారా? అని నేను మంత్రిని అడుగదలుచుకున్నా. మహిళలను గౌరవించడం భారతీయ పురుషులు ఎప్పుడు నేర్చుకుంటారు? ఆ మంత్రి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పి.. రాజీనామా చేయాలి' అని లలిత కుమారమంగళం స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు