2 నెలలు... 300 అత్యాచారాలు

8 Mar, 2015 18:17 IST|Sakshi
2 నెలలు... 300 అత్యాచారాలు

న్యూఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో నిర్భయ అత్యాచారం జరిగిన తర్వాత మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకువచ్చింది. కానీ న్యూఢిల్లీలో మాత్రం మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్టపడలేదు. సరికదా 2015 సంవత్సరం మొదటి రెండు నెలలో 300 అత్యాచారాల కేసులు నమోదు అయ్యాయి. ఈ గణాంకాలు చెప్పింది ఎవరో కాదు. సాక్షాత్తూ నగర పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ ఆదివారం వెల్లడించారు. నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లలో ఈ అత్యాచారాలపై ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు తెలిపారు.

2013 కంటే కొంత శాతం అధికంగా ఉన్నా... 2014  ఏడాది మొదటి రెండు నెలలో ఇదే సంఖ్యలో అత్యాచారాలు జరిగాయని ఆయన వివరించారు.  గతేడాది 2,069 అత్యాచార కేసులు నమోదు కాగా వాటిలో 67.17 శాతం కేసులు ఛేదించినట్లు చెప్పారు.  అయితే అత్యాచారం జరిగిన కేసుల్లో దాదాపు 96 శాతం మంది బాధితురాలు బంధువులు లేదా స్నేహితులు నిందితులుగా ఉంటున్నారని... మిగిలిన 4 శాతం మాత్రం ఆగంతకులు ఉంటున్నారని బస్సీ చెప్పారు.

మహిళలు చిన్ననాటి నుంచి ఆత్మరక్షణ చేసుకునేందుకు శిక్షణ ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. దాంతో 15 ఏళ్లు వచ్చే నాటికి వారిని వారు రక్షించుకునే స్థితిలో ఉంటారన్నారు. అలాగే ఈ ఏడాది లక్ష మంది బాలికలకు ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు... ఈ ఏడాది మార్చి 8 వరకు 26 వేల మంది బాలికలు అందులో శిక్షణ పొందటం ఆనందంగా ఉందని బుస్సీ తెలిపారు.

>
మరిన్ని వార్తలు