నెహ్రూ లేఖపై మళ్లీ రాజుకున్న వివాదం

23 Jan, 2016 20:18 IST|Sakshi
నెహ్రూ లేఖపై మళ్లీ రాజుకున్న వివాదం

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ మాజీ ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీకి భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ దేశానికి స్వాతంత్య్రం రాకముందు 1945, డిసెంబర్ 26వ తేదీన రాసినట్టుగా ప్రచారం జరుగుతున్న ఓ లేఖపై మళ్లీ వివాదం రాజుకుంది. అందులో బోస్‌ను బ్రిటిష్ యుద్ధ నేరస్థుడిగా నెహ్రూ పేర్కొనడం పట్ల రభస జరుగుతోంది. గత కొన్నేళ్లుగా ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన వంద ఫైళ్లను నరేంద్ర మోదీ ప్రభుత్వం శనివారం బయటపెట్టిన నేపథ్యంలో మళ్లీ నెహ్రూ వివాదాస్పద లేఖ సంచలనం సృష్టిస్తోంది.
 
ఈ లేఖ పూర్తిగా నకిలీదని, ఎవరో దురుద్దేశంతోనే సోషల్ మీడియాలో ఈ లేఖను ప్రచారం చేస్తున్నారని, వారందరిని వెతికి పట్టుకొని తగిన శిక్ష పడేలా చూస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ హెచ్చరించారు. రెండో ప్రపంచం యుద్ధం తర్వాత బ్రిటన్ రూపొందించిన ‘యుద్ధ నేరస్థుల’ జాబితాలో సుభాష్ చంద్ర బోస్ పేరు లేదనే విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ, రక్షణ శాఖ 2001లో భారత్‌కు స్పష్టం చేసిన విషయం తెల్సిందేనని శర్మ వ్యాఖ్యానించారు.

ఈ రోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం బోస్‌కు సంబంధించి విడుదల చేసిన వంద ఫైళ్లలో నెహ్రూ రాసినట్టుగా ప్రచారం అవుతున్న లేఖ, లేకపోవడం గమనార్హం అని చెప్పారు. అయినా ఈ దశలో మోదీ ప్రభుత్వం బోస్‌కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేవలం మోదీ ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ ఫైళ్లను బయటపెట్టిందని విమర్శించారు. బోస్‌ను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ స్వాతంత్య్ర యోధుడిగానే గుర్తిస్తుందని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని అన్నారు. వాస్తవానికి బీజేపీకిగానీ, దాని సంఘ్ పరివార్కుగానీ భారత స్వాతంత్య్ర పోరాటంతో ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
 
‘డియర్ మిస్టర్ అట్లీ, మీ యుద్ధ నేరస్థుడు, సుభాష్ చంద్ర బోస్ రష్యా దేశంలోకి ప్రవేశించేందుకు స్టాలిన్ అనుమతించారనే విషయం నాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెల్సింది. బ్రిటిష్, అమెరికన్లకు మిత్ర దేశాంగా ఉంటున్న రష్యా, బోస్‌ను తమ దేశంలోకి అనుమతించడం రష్యన్ల విశ్వాసాలను దెబ్బతీయడమేకాదు, మోసం చేయడం కూడా....ఇట్లు జవహర్‌లాల్ నెహ్రూ’ అని నెహ్రూ లేఖ రాసినట్లు ప్రచారం జరగుతోంది.

మరిన్ని వార్తలు