అప్పు చేసి షేర్లా! అమ్మో!!

8 Sep, 2013 00:32 IST|Sakshi
అప్పు చేసి షేర్లా! అమ్మో!!

 కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాభపడిన ఇన్వెస్టర్ల సక్సెస్ స్టోరీలను తెలుసుకున్నాం. కాకపోతే స్టాక్ మార్కెట్లో నష్టపోయిన వారూ ఎక్కువే ఉంటారు. అలా నష్టపోవటానికి బలమైన స్వయంకృతాపరాధాలు తప్పకుండా ఉంటాయి. ఈ వారం అలాంటి స్వయంకృతంతో తీవ్రంగా నష్టపోయిన వణుకూరు దుర్గా ఆనందరావు ‘ఫెయిల్యూర్ స్టోరీ’ని తెలుసుకుందాం...
 
 నా పేరు దుర్గా ఆనందరావు. మాది కృష్ణా జిల్లా వణుకూరు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని మొదటి నుంచీ ఉండేది. 1990లో మ్యూచువల్ ఫండ్స్‌తో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్రారంభించా. 1990 డిసెంబర్‌లో యూటీఐ మాస్టర్ ప్లస్ ఆఫర్ రావడంతో అందులో రూ.20,000 ఇన్వెస్ట్ చేశా. అది కొత్త ఫండ్ కావడంతో యూనిట్ రూ.10 చొప్పున చేతికి  రెండు వేల యూనిట్లు వచ్చాయి. ఇన్వెస్ట్ చేసిన ఆరు నెలలకే ఇన్వెస్ట్‌మెంట్ విలువ ఏకంగా మూడు రెట్లు పెరిగింది. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా పెరిగినపుడు అమ్మేస్తే బాగుండేదేమో!! కానీ అమ్మకుండా ఇంకా పెరుగుతుందని ఎదురు చూశా. అంతలోనే ఒక్కసారిగా మార్కెట్లు పతనమవుతూ ఇన్వెస్ట్‌మెంట్ విలువ తగ్గటం మొదలైంది. నాకు కాస్త భయమేసి తొలుత ఒక వెయ్యి యూనిట్లను రూ.42,000 వద్ద, మిగిలిన యూనిట్లను రూ.21,000 వద్ద విక్రయించా. ఇలా తక్కువ సమయంలోనే  రెండు రెట్లు లాభం రావడంతో నాలో అత్యాశ మొదలయింది. మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇంత లాభం ఉంటే నేరుగా షేర్లను కొని అమ్మితే ఇంకెంత లాభం వస్తుందోనన్న ఉద్దేశంతో సెకండరీ మార్కెట్లోకి ప్రవేశించా. నా అదృష్టం కొద్దీ కొన్న షేర్లన్నీ మంచి లాభాలిచ్చాయి.
 
 ఆరు నెలల్లోనే నా ఇన్వెస్ట్‌మెంట్ బాగా పెరిగింది. ఇలా రెండు చోట్లా లాభాలు రావడంతో నా ఆత్మ విశ్వాసం అతి విశ్వాసంగా మారిపోయింది. నా ఆశకు అంతు లేకుండా పోయింది. చేతిలో ఉన్న డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేయడమే కాకుండా నెలకు రూ.5 చొప్పున వడ్డీకి అప్పు తీసుకుని మరీ షేర్లలో పెట్టుబడి పెట్టా. నేను కొన్న షేర్లన్నీ ఆ సమయంలో బాగా పెరుగుతున్న కంపెనీలవే. కానీ నేను ఇలా అప్పు చేసి కొన్న  కొద్ది కాలానికే అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చి వేశారన్న వార్తలు రావడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్ప కూలాయి. ఆ సమయంలో నేను కొన్న షేర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. అవి ఘోరంగా పతనం కావడంతో పరిస్థితి అంతా తల్లకిందులయింది. ఒక్కసారిగా పిచ్చెక్కినట్లయ్యింది. అప్పుచేసి పెట్టుబడి పెట్టడంతో రిస్కును భరించలేకపోయాను.
 
 ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా వచ్చింది. అదే సమయంలో పెళ్ళి కావడంతో పరిస్థితి ఒక్కసారిగా అంధకారంలోకి నెట్టినట్టయింది. దీనికితోడు బంధువులు, చుట్టుపక్కల వాళ్ళ సూటిపోటి మాటలకు అవధుల్లేకుండా పోయాయి. ఇక తప్పని పరిస్థితుల్లో ఉన్న షేర్లన్నీ నష్టాలకు అమ్మేసి స్టాక్ మార్కెట్ నుంచి పూర్తిగా వైదొలిగాను. అప్పులిచ్చిన వాళ్ళతో మాట్లాడుకుని... బ్యాంకు వడ్డీ చెల్లిస్తానని వారిని ఒప్పించాను. మొత్తానికి అప్పుల నుంచి బయపడ్డాను. ఇక అప్పటి నుంచి నేను ఇక స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళలేదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి నా విజ్ఞప్తి ఒక్కటే. అత్యాశకు పోవద్దు. అప్పులు చేసి ఇన్వెస్ట్ చేయొద్దు.

మరిన్ని వార్తలు