మధుమేహ రోగులకు ఓ యాప్‌

29 Apr, 2017 03:02 IST|Sakshi
మధుమేహ రోగులకు ఓ యాప్‌

న్యూయార్క్‌: మధుమేహంతో బాధపడుతున్నవారు తమ రక్తంలోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ కొత్త యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ది చేశారు. ‘గ్లూకోరాకిల్‌’అనే ఈ యాప్‌  ఓ వ్యక్తి తీసుకునే ఆహారాన్ని బట్టి అతనిలోని చక్కెర స్థాయి ఎంత పెరుగుతాయో అంచనా వేస్తుందని అమెరికాలోని కొలంబియా వర్సిటీ మెడికల్‌ సెంటర్‌(సీయూఎమ్‌సీ)కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి.

అయితే ఏ ఆహారం తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేందుకు తమ యాప్‌ ఉపయోగపడుతుందని సీయూఎమ్‌సీ పరిశోధకుడు డేవిడ్‌ అల్బర్స్‌ తెలిపారు. మొదటగా యాప్‌లోకి రక్తంలోని చక్కెర స్థాయిల వివరాల్ని అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం వారు తీసుకునే ఆహారాన్ని ఫొటో తీసి.. సుమారుగా దానిలో ఉండే పోషక విలువలను అప్‌లోడ్‌ చేయాలి. దీంతో ఈ యాప్‌ మీరు అప్‌లోడ్‌ చేసిన ఆహారం తీసుకున్న తర్వాత చక్కెర స్థాయిలను అంచనా వేసి చూపిస్తుందని అన్నారు. ఈ పరిశోధన ఫలితాలు ‘పీఎల్‌వోఎస్‌ కాంప్యూటేషనల్‌ బయాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.  
 

మరిన్ని వార్తలు