కొప్పెరకు ‘కొత్త’ కళ!

22 Jan, 2016 08:29 IST|Sakshi
కొప్పెరకు ‘కొత్త’ కళ!

విధుల్లో చేరిన దర్జీ.. సిద్ధమవుతున్న శ్రీవారి కొప్పెర కొత్త వస్త్రాలు

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోని కొప్పెర(హుండీ)కు కొత్త వస్త్రాలు కుట్టే దర్జీ ఎట్టకేలకు గురువారం నుంచి విధులకు హాజరయ్యాడు. ‘‘శ్రీవారి కొప్పెరకు కొత్త వస్త్రాలేవ్!’’ అన్న శీర్షికతో ఈనెల 14న ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వెంటనే స్పందించింది. ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఆదేశాల మేరకు గతేడాది మార్చిలో తొలగించిన దర్జీ కె.దేవదాస్‌ను తిరిగి నియమించారు. బుధవారం ఉదయం ఫోన్ ద్వారా ఉత్తర్వులందుకున్న దేవదాస్ గురువారం నుంచి విధులకు హాజరయ్యాడు.

కొప్పెరకు అవసరమైన కొత్త వస్త్రాలు సిద్ధం చేసే పని తిరిగి చేపట్టాడు. గతంలో ఈయనకు రూ.6,400 నగదు, తిరుపతి-తిరుమల మధ్య ఉచిత ఆర్టీసీ బస్‌పాస్ ఇచ్చేవారు. తాజాగా ఈవో ఆదేశాలతో ఆయనకు ఉచిత బస్‌పాస్ గురువారంనుంచి అమల్లోకి వచ్చింది. పనికి తగిన వేతనం కూడా నిర్ణయించి ఇవ్వనున్నారు. కొప్పెరకు అవసరమైన వస్త్రాలకు ఏ లోటు లేకుండా ఉండేందుకు ఏడాదికి సరిపడా సిద్ధం చేస్తామని టీటీడీ ఈవో ‘సాక్షి’కి తెలిపారు.
 
దేవుడే తిరిగి రప్పించాడు
‘‘భక్తులు తమ మొక్కులు, ముడుపులు, కానుకలు వేసే కొప్పెరకు వస్త్రాలు కుట్టడాన్ని పనికన్నా.. సేవగాను, ైదైవకార్యంగా భావిస్తాం. గతంలో ఉద్యోగిగా ఆ పని చేశాను. తిరిగి రెండేళ్లపాటు కాంట్రాక్టు పద్ధతిన పనిచేశాను. మళ్లీ రమ్మని ఉత్తర్వులిచ్చారు. తొమ్మిది నెలల తర్వాత మళ్లీ కొప్పెర వస్త్రాలు కుట్టే అవకాశం ఆ దేవదేవుడే కల్పించారు. చాలా ఆనందంగా ఉంది. నాలో శక్తి ఉన్నంతకాలం ఈ విధులు కొనసాగిస్తాను.’’
 - దేవదాస్, కొప్పెర వస్త్రాలు కుట్టే దర్జీ

మరిన్ని వార్తలు