కాంతితో ఇంటర్‌నెట్

21 Oct, 2013 14:54 IST|Sakshi
కాంతితో ఇంటర్‌నెట్

* ఎల్‌ఈడీ బల్బులతో సమాచారాన్ని ప్రసారం చేసే ‘లైఫై’ టెక్నాలజీని అభివృద్ధి చేసిన చైనా శాస్త్రవేత్తలు
* వ్యయం తక్కువ.. భద్రత ఎక్కువ
* కేవలం ఒక వాట్ బల్బుతో నాలుగు కంప్యూటర్లకు నెట్
 
 బీజింగ్: కేవలం కాంతి (లైట్)తో వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య సమాచారాన్ని ప్రసారం చేయగల సరికొత్త సాంకేతికతను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘వైఫై’ను పోలిన ఈ టెక్నాలజీని ‘లైఫై’గా పిలుస్తున్నారు. వైఫైలో రేడియో తరంగాలను ఉపయోగిస్తే.. ఈ ‘లైఫై’లో కేవలం కాంతిని మాత్రమే వినియోగిస్తారు. వైఫైలో వాడే పరికరాల ధర ఎక్కువ, వాటి విద్యుత్ వినియోగమూ ఎక్కువే. అదే ‘లైఫై’కి అయ్యే వ్యయం, విద్యుత్ వినియోగం చాలా తక్కువ.

‘లైఫై’ టెక్నాలజీ ద్వారా కేవలం ఒక వాట్ సామర్థ్యమున్న చిన్న ఎల్‌ఈడీ బల్బుతో ఏకంగా సెకనుకు 150 మెగాబిట్స్ వేగంతో నాలుగు కంప్యూటర్లకు ఇంటర్‌నెట్‌ను అందించవచ్చు. ఇందులో సమాచార భద్రత, ఇతర సౌకర్యాలూ ఎక్కువే. దీనితో నెట్‌ను అందుకోవడమే కాదు.. ప్రింటర్లు, స్కానర్లు, మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటి మధ్యా సమాచార మార్పిడి చేయవచ్చు.దీనిలో రేడియో తరంగాల వాడకం లేకపోవడంతో.. విమానాల్లోనూ, రేడియేషన్ ఉండే సున్నిత ప్రదేశాల్లోనూ ఇంటర్‌నెట్‌ను వినియోగించుకోవచ్చు. అయితే, ఈ టెక్నాలజీకి కొన్ని పరిమితులూ ఉన్నాయి. కేవలం లైట్ ఆపేస్తే ఇంటర్‌నెట్ నిలిచిపోతుంది.

గోడలు అడ్డుగా ఉండడం, ఎక్కువ దూరం లో ఉంటే పనిచేయకపోవడం దీనిలో లోపాలు. ‘లైఫై’ టెక్నాలజీని తొలుత బ్రిట న్‌కు చెందిన ఎడిన్‌బర్గ్ వర్సిటీ శాస్త్రవేత్త హరాల్డ్ హాస్ ప్రతిపాదించారు. దానిని తాజాగా చైనాకు చెందిన షాంఘై ఫుడాన్ వర్సిటీ ప్రొఫెసర్ చి నాన్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే, ఈ ‘లైఫై’ టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని ప్రొఫెసర్ చి నాన్ చెప్పారు. చైనాలోని షాంఘైలో వచ్చే నెల 5న జరగనున్న అంతర్జాతీయ ఇండస్ట్రీ ఫెయిర్‌లో పది ‘లైఫై’ కిట్లను ప్రదర్శనకు పెట్టనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు