రైళ్లలో 2నిమిషాల్లోనే ఫుడ్!

12 Oct, 2016 14:15 IST|Sakshi
రైళ్లలో 2నిమిషాల్లోనే ఫుడ్!
మథుర: దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్ధ అయిన భారతీయ రైల్వేల్లో ఆహారంపై వచ్చే ఫిర్యాదులు లెక్కేలేదు. అయితే, తాజాగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ప్రయాణికులకు పెద్ద రిలీఫ్ ను ఇస్తోంది. ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన రెండు నిమిషాల్లోనే డెలివరీ ఇచ్చే సిస్టమ్ ను రైల్వేశాఖ విజయవంతంగా అమలుచేసింది.
 
ఈ సౌకర్యాన్ని వాడుకోవడానికి కావలసిన ఆహారాన్ని స్మార్ట్ ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తే చాలు. కెంటకీ ఫ్రైడ్ చికెన్ నుంచి డోమినోస్ పిజ్జా వరకూ అన్ని రకాల ఆహారాలను ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా రైల్వేశాఖ చర్యలు తీసుకుంది. రైల్వేశాఖ తీసుకొచ్చిన ఈ విధానంపై ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
తాను ఆర్డర్ ఇచ్చిన శాఖహారపు డిష్ కేవలం రెండు నిమిషాల్లో సీటు వద్దకు వచ్చిందని ఓ ప్రయాణీకుడు తెలిపారు. గతంలో రైల్వే శాఖ ఇచ్చే ఆహారం కంటే ప్రస్తుత ఆహారం వంద రెట్లు బాగుందని మరో ప్రయాణీకుడు అన్నారు. కొద్ది సంవత్సరాల క్రితం రైల్వే శాఖ ప్రయాణీకులకు అందిస్తున్న ఆహారంలో బొద్దింకలు ఉంటున్నాయనే రిపోర్టులు వచ్చాయి.
 
అంతేకాకుండా ప్యాంట్రీ కార్లలో పరిశుభ్రతను పాటించడం లేదనే ఆరోపణలు కూడా దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి. దీంతో అంతర్మథనంలో పడిన రైల్వే శాఖ కొత్త తరహా ఆహార సరఫరాకు గత ఏడాది 137బిలియన్ డాలర్లను కేటాయించింది. త్వరలో కొన్ని మేజర్ స్టేషన్లలో ఫుడ్ కంపెనీల ద్వారా ప్రయాణీకులకు తాజా ఆహారాన్ని అందించనున్నట్లు రైల్వేశాఖ అధికారప్రతినిథి అనిల్ కుమార్ సక్సేనా తెలిపారు.
మరిన్ని వార్తలు