రాగద్వేషాలకు అతీతంగా పనిచేశా: మన్మోహన్

3 Jan, 2014 13:32 IST|Sakshi
రాగద్వేషాలకు అతీతంగా పనిచేశా: మన్మోహన్

న్యూఢిల్లీ: సరైన సమయంలో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. సాధారణ ఎన్నికల అనంతరం యూపీఏ కొత్త ప్రధానిని ఎన్నుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల అనంతరం కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడించారు. ఢిల్లీ రైసినా రోడ్డులోని నేషనల్ మీడియా సెంటర్‌లో మన్మోహన్ పూర్తిస్థాయి విలేకరుల సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.

తమ ప్రభుత్వం అనేక చారిత్రక చట్టాలను అమల్లోకి తెచ్చిందని తెలిపారు. రాజీనామా చేయాలని ఎప్పుడు అనిపించలేదని, రాగద్వేషాలకు అతీతంగా పనిచేశానన్నారు. తనను దిగిపోమ్మని ఎవరూ అడగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ నుంచి తనకు అనూహ్య మద్దతు లభించిందన్నారు. ఈ పదేళ్లలో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు రాలేదన్నారు. రాహుల్ గాంధీ సమర్థుడైన నాయకుడు, ఆయన విషయంలో పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. యూపీఏ- 3 ప్రభుత్వం గురించి ఇప్పుడే మాట్లాడడం అసంగతమన్నారు. గ్రామీణ ప్రాంతాలు, నగరాల మధ్య అంతరం తగ్గుతోంది. ధరల పెరుగుదల ప్రజలను కాంగ్రెస్కు దూరం చేసిందన్నారు. ధరాభారం నుంచి పేదలను కాపాడేందుకు కృషి చేశామన్నారు.

గతంలో ఎన్నడూలేనంతగా వ్యవసాయ వృద్ధిరేటు పెరిగిందన్నారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రాధాన్యంగా దృష్టి సారించామని చెప్పారు. తాము సాధించిన అభివృద్ధిని విపులంగా చెప్పేందుకు ఇప్పుడు సమయం తక్కువగా ఉందన్నారు. అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మందగమనం నుంచి బయటపడుతున్నాయని తెలిపారు.
 

నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ప్రధాని కావడం వినాశకరపరిణామంగా భావిస్తానని మన్మోహన్ అన్నారు. గుజరాత్లో జరిగిన మారణకాండ మళ్లీ దేశంలో జరగాలని కోరుకోవడం లేదన్నారు. ఇప్పుడున్న మీడియాతో పోలిస్తే చరిత్రకారులు తన పట్ల సున్నితంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు