ఆ రెండు కొత్త గ్రహాల్లో ఎలియన్స్!

12 Nov, 2015 17:38 IST|Sakshi
ఆ రెండు కొత్త గ్రహాల్లో ఎలియన్స్!

ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా రెండు కొత్త గ్రహాలను కనుగొన్నారు. ఈ కొత్త గ్రహాల ఉనికితో మన సౌర వ్యవస్థ సరిహద్దులు మరింత విస్తృతమయ్యే అవకాశముందని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర గ్రహాల్లోనూ జీవం ఉనికి ఉందా? అని ఎన్నాళ్లుగానో సాగుతున్న అన్వేషణలో ఈ రెండు కొత్త గ్రహాలు పెద్ద ముందడుగు అయ్యే అవకాశముందని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ రెండు కొత్త గ్రహాల్లో ఒకటి మన సౌర వ్యవస్థ అంచుల్లో ఉండగా.. మరొకటి దానికి మరికొంత దూరంలో ఉంది. ఈ రెండు కొత్త గ్రహాల ఉనికి ఖగోళ పరిశోధనలో పెద్ద మలుపు అని పరిశీలకులు భావిస్తున్నారు. మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహాల్లో జీవం ఉందని చెప్పడానికి ఈ రెండు కొత్త గ్రహాలు అవకాశమివ్వొచ్చని ఆస్ట్రేలియా కాన్‌బెర్రాలోని మౌంట్ స్ట్రోమ్లో అబ్జర్వేటరీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త బ్రాడ్ టక్కర్ వ్యాఖ్యానించారు. ఈ గ్రహాలను కనుగొనడం.. విశ్వంలో మరో భూమిని కనుగొనడం లాంటిదేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భూమి మీద మాత్రమే జీవం ఉందని, ఈ నేపథ్యంలో భూమిలాంటి గ్రహంలోనే జీవం ఉండే అవకాశముందని భావించవచ్చునని తెలిపారు.

సౌరవ్యవస్థ అంచుల్లో ఉన్న నూతన రాతి గ్రహానికి శాస్త్రవేత్తలు జీజే 1132బీగా నామకరణం చేశారు. సౌర వ్యవస్థ అంచుల్లో ఉన్న ఈ గ్రహం అత్యంత కీలకమైందని, ఇతర గ్రహాలతో పోలిస్తే.. ఇది సమీపంలో ఉండటంతో దీనిపై ఖగోళ శాస్త్రవేత్తలు విశేషమైన పరిశోధనలు చేసే అవకాశముందని మేరిల్యాండ్ యూనివర్సిటీ ఖగోళ నిపుణుడు డ్రాక్ డిమింగ్ 'నేచర్' జర్నల్‌కు రాసిన లేఖలో తెలిపారు.
 

మరిన్ని వార్తలు