మార్కెట్‌లోకి కొత్త యూరియా!

12 Aug, 2013 03:32 IST|Sakshi
మార్కెట్‌లోకి కొత్త యూరియా!

కేంద్రం ఆదేశంతో ‘వేపనూనె’ యూరియాను తీసుకొచ్చిన కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: దేశీయ మార్కెట్‌లోకి కొత్త రకం యూరియా వచ్చింది. మనదేశంలో తయారవుతున్న యూరియాలో కనీసం 35 శాతం వేపనూనె పూత యూరియా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు ఈ యూరియాను తీసుకొచ్చారు. రాష్ట్రంలో అత్యధికంగా యూరియాను సరఫరాచేసే ‘క్రిషక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్’(క్రిభ్‌కో) ఇప్పటికే 65వేల టన్నుల వేప నూనె పూత ఉన్న యూరియాను మన మార్కెట్‌లో ఉంచగా, నాగార్జున ఫెర్టిలైజర్స్ మరో 10వేల టన్నుల యూరియాను అందుబాటులో ఉంచింది. యూరియా వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఈ చర్య వల్ల రైతులకు ప్రయోజనం కలగడమే కాకుండా యూరియా దిగుమతులు తగ్గి ఏడాదికి దాదాపు 99 కోట్ల డాలర్ల(దాదాపు రూ.5,940 కోట్లు) విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
  ప్రస్తుతం వాడుకలో ఉన్న యూరియాలో పైర్లకు 30 శాతం అందుతుండగా.. మిగిలిన 70 శాతం గాలిలో, భూమిలో వృథా అవుతుంది. యూరియాకు వేప నూనె పూత ఉంటే ఈ వృథా గణనీయంగా తగ్గుతుంది. చాలాకాలం నుంచి వ్యవసాయ శాఖ అధికారులు యూరియాకు వేప నూనె పూత వేయమని రైతులకు సలహా ఇస్తూ ఉన్నారు. అయితే రైతు స్థాయిలో ఇలా చేయడంలో ఉన్న ఇబ్బందుల రీత్యా ఈ సలహాను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో యూరియా ఉత్పత్తి దశలోనే వేప నూనె పూత ఉండేలా చూసేందుకు కేంద్రం నడుంబిగించింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 35 శాతం యూరియాకు వేపనూనె పూత తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. దీంతో సంబంధిత యూరియా కంపెనీలు వారి కర్మాగారాల్లో అందుకు తగిన మార్పులు చేసుకుంటున్నాయి. వచ్చే రెండు మూడేళ్లలో వేప పూత యూరియానే మార్కెట్‌లో ఉంచేలా చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
 
 బస్తాకు రూ.14 అదనం...
 ప్రస్తుతం మామూలు యూరియా 50 కిలోల బస్తా ధర రూ.284 ఉండగా, వేప నూనె పూత పూసిన యూరియా బస్తా ధరను రూ.298గా ప్రభుత్వం నిర్ణయించింది. బస్తాకు రూ.14 అదనంగా చెల్లించినా, ఐదు బస్తాల మామూలు యూరియా వాడాల్సిన చోట వేప నూనె పూత ఉన్న యూరియా నాలుగు బస్తాలు వేస్తే సరిపోతుంది. వేప నూనె పూత యూరియా వాడకం పూర్తిస్థాయిలో అలవాటైతే దేశవ్యాప్తంగా 30 లక్షల టన్నుల యూరియా వాడకం తగ్గే అవకాశం ఉంది.
 
 దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఏటా 3 కోట్ల టన్నుల యూరియా వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో 30 లక్షల టన్నుల యూరియా వినియోగంలో ఉంది. వేప నూనె పూత పూసిన యూరియా వాడినట్లయితే కనిష్టంగా 10 శాతం యూరియా వినియోగం తగ్గుతుంది. దీంతో ఆ మేరకు యూరియా దిగుమతులను తగ్గించుకోవచ్చని క్రిభ్‌కో అధికారి ఒకరు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా టన్ను యూరియా 330 డాలర్లు పలుకుతోందని, ఈ లెక్కన మనకు దాదాపు 99 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందన్నారు. క్రిభ్‌కో, నాగార్జున ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్, గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(ఉజ్వల యూరియా)లు మన రాష్ట్రానికి ప్రధానంగా యూరియా సరఫరా చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు