కొత్త ఏడాది.. కొలువుల మేళా

26 Dec, 2013 00:45 IST|Sakshi
కొత్త ఏడాది.. కొలువుల మేళా

 8.5 లక్షల ఉద్యోగాలు రావచ్చు...   వివిధ నియామక సంస్థల వెల్లడి
 ఎఫ్‌ఎంసీజీ రంగంలో అత్యధికంగా జాబ్స్...   తర్వాత స్థానాల్లో హెల్త్‌కేర్, ఐటీ
 

 న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం ఉద్యోగార్థులకు కొత్త ఆశలను రేపుతోంది. 2014లో భారీస్థాయిలో కొత్త ఉద్యోగాలొస్తాయని మైహైరింగ్‌క్లబ్‌డాట్‌కామ్, శాట్-ఎన్-మెర్క్ మ్యాన్‌పవర్ కన్సల్టెంట్లు అంటున్నాయి. ఈ ఏడాది అంచనాలకు తగ్గట్లుగా ఉద్యోగాలు రాలేదని శాట్-ఎన్-మెర్క్ మ్యాన్‌పవర్ కన్సల్టెంట్ పేర్కొంది. ఆదాయం పెంచుకోవాలంటే దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందేనని కంపెనీలు భావిస్తున్నాయని వివరించింది. మరోవైపు వచ్చే ఏడాది ఎనిమిదిన్నర లక్షలకు పైగా కొత్త కొలువులు వస్తాయని మైహైరింగ్‌క్లబ్‌డాట్‌కామ్ నిర్వహించిన సర్వేలో తేలింది. మొత్తం 12 రంగాల్లో 5,600 కంపెనీలపై ఈ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఎఫ్‌ఎంసీజీ, ఆరోగ్య సంరక్షణతో సహా వివిధ కేటగిరీల్లో ఈ ఉద్యోగాలు వస్తాయంటున్న ఈ సర్వేలో ముఖ్యాంశాలు...,
 
   ఈ ఏడాది కొత్తగా వచ్చిన కొలువులు 7.9 లక్షలుగా ఉన్నాయి. దేశీయంగా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, వచ్చే ఏడాది ఇంతకంటే ఎక్కువగానే (8.5 లక్షలు) కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. అంచనా వేస్తున్న ఈ ఉద్యోగాలన్నీ వ్యవస్థీకృత రంగంలోనివే.
 
   ఎఫ్‌ఎంసీజీ రంగంలో అధికంగా (1.5 లక్షలు) కొత్త కొలువులు వస్తాయి. ఆరోగ్య సంరక్షణ(1.33 లక్షలు), ఐటీ, ఐటీఈఎస్(1.21 లక్షలు), రిటైల్(86,700),  ఆతిథ్యం(83,400), బ్యాంకింగ్, ఆర్థిక సేవలు(61,400), తయారీ, ఇంజనీరింగ్(51,500),  విద్య, శిక్షణ, కన్సల్టెన్సీ (42,900), మీడియా, వినోదం(42,800), రియల్టీ(38,700) రంగాల్లో అధిక సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి.
 
   ఉద్యోగం చేయడానికి కావలసిన నైపుణ్యాలు, వాటిని అలవర్చుకోవడం, పని వాతావరణంలో ఇమడడం... వంటి సమస్యలున్నాయి. ఇవే వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
 
 

మరిన్ని వార్తలు