కొత్తగా 12 పంచాయతీరాజ్ డివిజన్లు

19 Jan, 2016 04:19 IST|Sakshi
కొత్తగా 12 పంచాయతీరాజ్ డివిజన్లు

నిజామాబాద్, మెదక్ మినహా అన్ని జిల్లాల్లో అదనపు డివిజన్లు
సాక్షి, హైదరాబాద్ : పంచాయతీరాజ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో రాష్ట్రంలో మరో 12 పంచాయతీరాజ్ డివిజన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖలో 40, పంచాయతీరాజ్ విభాగంలో 28 డివిజన్లు ఉన్నాయి. దీంతో పరిపాలనాపరమైన ఇబ్బందులతోపాటు ఉన్నతాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞాపనలను పరిశీలించిన ప్రభుత్వం, రెవెన్యూ డివిజన్లతో సమానంగా పంచాయతీరాజ్ డివిజన్లను ఏర్పాటు చేసింది. మెదక్, నిజామాబాద్ జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో అదనపు డివిజన్లు ఏర్పాటయ్యాయి.
 
కొత్త డివిజన్ల ఇవే...
ఆదిలాబాద్ జిల్లాలో 187 గ్రామాలతో మంచిర్యాల, 115 గ్రామాలతో ఉట్నూర్ పంచాయతీరాజ్ డివిజన్లు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలో 211 గ్రామాలతో సిరిసిల్ల, 122 గ్రామాలతో మంథని, ఖమ్మం జిల్లాలో 93 గ్రామాలతో పాల్వంచ, వరంగల్ జిల్లాలో 200 గ్రామాలతో జనగాం, 119 గ్రామాలతో నర్సంపేట,  మహబూబ్‌నగర్ జిల్లాలో 165 గ్రామాలతో వనపర్తి, రంగారెడ్డి జిల్లాలో 82 గ్రామాలతో మల్కాజిగిరి, 38 గ్రామాలతో రాజేంద్రనగర్, నల్లగొండ జిల్లాలో 253 గ్రామాలతో సూర్యాపేట, 151 గ్రామాలతో దేవరకొండ పంచాయతీరాజ్ డివిజన్లను కొత్తగా ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ మేరకు తెలుగు, ఇంగ్లిష్‌భాషల్లో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను సర్కారు ఆదేశించింది. కొత్త డివిజన్లకు అవసరమైన సిబ్బంది, బడ్జెట్ ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని పంచాయతీరాజ్‌శాఖ డెరైక్టర్‌కు ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం నిర్ణయంపై పంచాయతీరాజ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు