వచ్చే వేసవిలోగా బ్యారేజీ పనులు

11 Sep, 2015 03:15 IST|Sakshi
వచ్చే వేసవిలోగా బ్యారేజీ పనులు

మంత్రి హరీశ్‌రావు
జైనథ్: తెలంగాణ, మహారాష్ట్రలోని కోర్ట, చనాక గ్రామాల మధ్య పెన్‌గంగ నదిపై నిర్మించనున్న బ్యారేజీ పనులు వచ్చే వేసవికి ముందే ప్రారంభిస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు నల్లాల ఓదేలు, రాథోడ్ బాపురావు, విఠల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ జగన్మోహ న్‌తో కలసి మహారాష్ట్రలోని చనాక గ్రామంలో పర్యటించారు.

బ్యారేజీ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, అందులో భాగంగానే లోయర్ పెన్‌గంగ, పెన్‌గంగపై తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య మూడు బ్యారేజీల నిర్మాణానికి పూనుకుందని అన్నారు.

సగ్దసాంగిడి, పింప్రడ్ బ్యారేజీలను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుండగా, కోర్ట, చనాక బ్యారేజీని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ.300 కోట్లతో ఈ బ్యారేజీ పనులను పూర్తి చేసి ఇరు రాష్ట్రాల్లో తాగు, సాగునీరు వసతులను కల్పిస్తామని అన్నారు. కోర్ట, చనకా బ్యారేజీ ద్వారా తెలంగాణలోని జైనథ్, బేల మండలాల్లో 12,500 ఎకరాలకు, మహారాష్ట్రలో 3 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.

ఈ బ్యారేజీకి సంబంధించిన డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను సిద్ధం చేశామని.. ఈ నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందించి అన్ని అనుమతులు పూర్తి చేసుకుని త్వరలోనే రిజర్వాయర్ పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఈ భగవంత్‌రావు, మహారాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కరించాలని హరీశ్‌రావుకు వినతిపత్రం సమర్పించారు.

మరిన్ని వార్తలు