8,800 మార్కు దాటేసిన నిఫ్టీ

6 Feb, 2017 16:23 IST|Sakshi
ముంబై :
వడ్డీరేట్ల  కోత అంచనాలతో మార్కెట్లు సోమవారం ఐదు నెలల గరిష్టంలోకి ఎగిశాయి. 198.76 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్ 28,439.28 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం తన కీలకమైన మార్కు 8,800ను దాటేసింది. గత నాలుగు నెలలో నిఫ్టీ 8,800 మార్కును దాటడం ఇదే మొదటిసారి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, బ్యాంకింగ్ షేర్ల కొనుగోలు మద్దతుతో మార్కెట్లు నేడు లాభాల్లో నడిచాయి. అదేవిధంగా రేపటి నుంచి జరుగబోయే రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ద్రవ్యపరపతి విధాన సమీక్షలో సెంట్రల్ బ్యాంకు  వడ్డీరేట్లలో 0.25 శాతం కోత పెడుతుందని అంచనాలు వెలువడుతున్నాయి.
 
దీంతో దలాల్ స్ట్రీట్లో బులిష్ సెంటిమెంట్ నెలకొంది. నేటి మార్కెట్లో అంబుజా సిమెంట్స్, సన్ ఫార్మా, ఏసీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, అరబిందో ఫార్మా టాప్ గెయినర్లుగా లాభాలు పండించగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, ఓఎన్జీసీ, హిందాల్కో, కోల్ ఇండియా, ఎస్బీఐ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.  అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.11 పైసల లాభపడి, 67.21 వద్ద ముగిసింది. గోల్డ్ ధరలు కూడా ఎంసీఎక్స మార్కెట్లో 100 రూపాయలు పెరిగి, రూ.29,009గా నమోదయ్యాయి. 
మరిన్ని వార్తలు