130 మంది భార్యల ఒక్కగానొక్క భర్త ఇకలేరు

31 Jan, 2017 11:59 IST|Sakshi
130 మంది భార్యల ఒక్కగానొక్క భర్త ఇకలేరు

- వివాదాస్పద మతబోధకుడు అబూబకర్‌ కన్నుమూత
- 203 మంది పిల్లలకు పితృవియోగం
- అంతుచిక్కని వ్యాధితో ఇంట్లోనే తుదిశ్వాస


అబూజా:
వివాదాస్పద మతబోధకుడు, 130 మంది భార్యలకు భర్త, 203 మంది పిల్లలకు తండ్రి అయిన మొహమ్మద్‌ బెలో అబూ బకర్‌ అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. 93 ఏళ్ల అబూ బకర్‌ నైజీరియాలోని బిడా రాష్ట్రంలోగల తన నివాసంలో తుదిశ్వాస విడిచనట్లు ఆయన సహాయకులు ఆదివారం మీడియాకు తెలిపారు.

స్థానికులు ‘బాబా’గా వ్యవహరించే అబూ బకర్‌ పవిత్రగ్రంథానికి వింత భాష్యాలు చెప్పడంతో పాపులర్‌ అయ్యాడు. ఒక పురుషుడు ఎంతమంది స్త్రీలనైనా వివాహం చేసుకోచ్చనేది ఆయన వాదన. ఆ క్రమంలో 130 మంది మహిళలను పెళ్లాడిన బకర్‌.. వారి ద్వారా 203 మంది పిల్లలకు తండ్రి అయ్యారు. రెండంతస్తుల భారీ భవనంలో నివసించే ఆయన కుటుంబం.. ప్రంపంచంలోనే అతిపెద్ద కుటుంబంగా రికార్డులకెక్కింది. కాగా, బకర్‌ కన్నుమూసేనాటికి ఆయన భార్యల్లో కొంతమంది గర్భవతులు కూడా ఉన్నారు.

2008లో అబూ బకర్‌.. రెండు గంటల వ్యవధిలోనే 82 మంది భార్యలకు విడాకులు ఇచ్చారు. అప్పట్లో అదొక సంచలన వార్త. పెళ్లిళ్లపై ఉపన్యాసాలు దంచే బకర్‌.. ఒకేసారి అంతమంది భార్యలకు విడాకులు ఇవ్వడాన్ని ఇతర మతపెద్దలు తీవ్రంగా తప్పుపట్టారు. ఏదిఎలా ఉన్నా, భగవంతుడి ఆదేశాలను పాటించడానికే తాను జన్మించానని బకర్‌ పలుమార్లు చెప్పుకున్నాడు. చనిపోవడానికి కొద్దిరోజుల ముందు.. దేవుడు తనకు అప్పగించిన పని ముగిసిందని బకర్‌ అనుచరులతో చెప్పాడట. బకర్‌ మరణానికి దారితీసిన వ్యాధి ఏమిటనేది తెలియాల్సిఉంది.






మరిన్ని వార్తలు