చరిత్ర సృష్టించిన నిక్కీ హెలీ!

25 Jan, 2017 09:34 IST|Sakshi
చరిత్ర సృష్టించిన నిక్కీ హెలీ!

వాషింగ్టన్‌: ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన నిక్కీ హెలీ నియామకాన్ని అమెరికా సెనేట్‌ మంగళవారం ఖరారు చేసింది. ప్రస్తుతం దక్షిణ కరోలినా గవర్నర్‌గా ఉన్న ఆమె త్వరలోనే తన పదవికి రాజీనామా చేసి.. అమెరికాలోనే అత్యున్నత దౌత్యపదవిని చేపట్టనున్నారు. రిపబ్లికన్‌ పార్టీ రైజింగ్‌ స్టార్‌గా పేరొందిన నిక్కీ హెలీకి దౌత్య అనుభవం లేకపోయినా.. ఈ పదవి చేపట్టేందుకు ఆమెకు సెనేట్‌లో బంపర్‌ మెజారిటీ లభించడం గమనార్హం. డెమొక్రాట్లు సైతం ఆమెకు మద్దతు పలుకడంతో 96-4 మార్జిన్‌తో సెనేట్‌ ఆమోదం లభించింది. దీంతో అమెరికా అధ్యక్ష యంత్రాంగంలో క్యాబినెట్‌ ర్యాంకు పొందిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా నిక్కీ హెలీ చరిత్ర సృష్టించారు.

తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించే వ్యక్తిగా పేరొందిన నిక్కీ హెలీ సెన్సిబుల్‌ దౌత్యవేత్తగా అమెరికా ఖ్యాతిని ఐరాసలో నిలబెడతారని డెమొక్రాట్లు కూడా భావిస్తుండటంతోనే ఆమెకు ఈ స్థాయిలో మద్దతు లభించింది. అమెరికా ఎన్నికల ప్రచారంలో ఐరాసపై కూడా ట్రంప్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ట్రంప్‌ అభిప్రాయాలతో నిక్కీ హెలీ నిర్ద్వంద్వంగా విభేదించారు. రాయబారి పదవీ ధ్రువీకరణ విషయంలో సెనేట్‌ కమిటీ ముందు హాజరైన నిక్కీ.. రష్యా తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. నాటో కొనసాగింపును స్వాగతించారు. అలాగే ముస్లింలపై నిషేధం విధించాలి, వారి జనాభా రిజిస్టర్‌ను కొనసాగించాలన్న వ్యాఖ్యలను సైతం వ్యతిరేకించారు. ఇవన్ని అధ్యక్షుడు ట్రంప్‌ అభిప్రాయాలను విభేదించేవే. అయినా నిర్భయంగా నిక్కీ తన అభిప్రాయాలను వ్యక్తీకరించడంతో ప్రతిపక్ష డెమొక్రాట్‌ సభ్యుల మద్దతును కూడా ఆమె పొందగలిగారు.
 

మరిన్ని వార్తలు