మరో రైలు బుగ్గి

9 Jan, 2014 04:02 IST|Sakshi
మరో రైలు బుగ్గి

సాక్షి, ముంబై: పది రోజుల వ్యవధిలో మళ్లీ అదే ఘోరం. రైల్వే భద్రత గాల్లో దీపం చందమన్నట్లుగా మంటల్లో మరో రైలు కాలిపోయింది. 9 మంది ప్రయాణికులను బుగ్గి చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 28న బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి 26 మంది సజీవదహనమైన దుర్ఘటన మరవకముందే మరోసారి అదే తరహా ప్రమాదం జరిగింది.
 
 
 మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉన్న డహాన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి సుమారు 2.50 గంటలకు బాంద్రా నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 9 మంది ప్రయాణికులు సజీవదహనమవగా మరో ఐదుగురు గాయపడ్డారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాలు... రైలు ముంబైకి సుమారు 140 కి.మీ. దూరంలో ఉన్న థానే జిల్లా డ హాన్ తాలూకా వద్దకు చేరుకోగానే ఎస్-2, ఎస్-3 బోగీల మధ్య వెస్టిబ్యూల్ (లింకు)లో మంటలు ఒక్కసారిగా అంటుకున్నాయి. ఆపై ఎస్-4 బోగీకి వ్యాపించాయి.
 
 ఆ సమయంలో ఎస్-4లో 64 మంది ప్రయాణికులు ఉండగా ఎస్-2లో 54 మంది, ఎస్-3లో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. బోగీలకు మంటలు అంటుకోవడాన్ని గుర్తించిన కొందరు ప్రయాణికులు బిగ్గరగా అరచి అందరినీ అప్రమత్తం చేసేందుకు యత్నించగా మరికొందరు చైన్ లాగి రైలును ఆపేందుకు ప్రయత్నించారు. చాలా మంది వెనక తలుపులు తెరుచుకొని ప్రాణాలు దక్కించుకోగా తొమ్మిది మంది దట్టమైన పొగల నుంచి బయటపడలేక సజీవదహనమయ్యారు. మృతుల్లో ఒక మహిళ, నలుగురు పురుషులు ఉన్నట్లు అధికారులు ఇప్పటివరకూ గుర్తించినట్లు పశ్చిమ రైల్వే పీఆర్‌వో శరత్ చంద్ర తెలిపారు. మిగతా వారిని గుర్తించాల్సి ఉందన్నారు. ఎస్-3 బోగీ అడుగున కాలిన వైర్లు కనిపించడంతో ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చన్నారు.
 
 గేట్‌మన్ సమయస్ఫూర్తి...
 రైల్వే గేట్‌మన్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం భారీగా తగ్గింది. రైలుకు మంటలు అంటుకోవడాన్ని డహాన్ రోడ్-ఘోల్వాడ్ లెవల్ క్రాసింగ్ వద్ద గమనించిన గేట్‌మన్ వెంటనే రైలుకు రెడ్ సిగ్నల్ ఇచ్చి రైలును నిలిపేందుకు యత్నించాడు. అయితే రైలు అప్పటికే ముందుకు వెళ్లిపోవడంతో ఘోల్వాడ్ రైల్వేస్టేషన్ మాస్టర్‌కు ఈ విషయాన్ని తెలియజేశాడు. స్టేషన్ మాస్టర్ రైలు డ్రైవర్‌కు విషయం చెప్పడంతో ఘోల్వాడ్ స్టేషన్ సమీపంలో రైలును ఆపాడు. అనంతరం మంటలను ఆర్పేశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశం: ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రైల్వే మంత్రి మలికార్జున ఖర్గే...మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. దుర్ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఘటనాస్థలిని సందర్శించారని వివరించారు. కాగా, ఢిల్లీ నుంచి లక్నో వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. బ్రేకు జామ్ కారణంగా ఓ బోగీ చక్రాల నుంచి పొగలు వ్యాపించాయి.
 
 ఆస్ట్రేలియా పరిజ్ఞానంతో ఫైర్ అలారం
 రైళ్లలో తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా పరిజ్ఞానంతో ఫైర్ అలారం వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వేశాఖ అధికారి ఒకరు తెలిపారు. భువనేశ్వర్-రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో గతంలో ఉపయోగించిన అలారం వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఈ కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దీన్ని జమ్మూ-రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో మరో 20 రైళ్లలో ఈ ఫైర్ అలారం వ్యవస్థను అమరుస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు