ఈ-పేమెంట్ చేసేవారికి నీతిఆయోగ్ బొనాంజా!

12 Dec, 2016 14:25 IST|Sakshi
ఈ-పేమెంట్ చేసేవారికి నీతిఆయోగ్ బొనాంజా!
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలు చేస్తున్న వారికి బంపర్ ఆఫర్ ఇచ్చే ఆలోచనను నీతి ఆయోగ్ పరిశీలిస్తోంది. అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం ఎలక్ట్రానిక్ పేమెంట్లను చేస్తున్న వినియోగదారులకు ఈ ఆఫర్ ను వర్తింపజేయాలనే నిర్ణయానికి వస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఓ ప్రత్యేక పథకం రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇందులో రూ.కోటి నగదు బహుమతితో పలు రకాల ఆకర్షణీయ ఆఫర్ లు ఉన్నట్లు సమాచారం.
 
పథకం రూపొందించడంలో కీలక భూమిక పోషించాలని నేషనల్ పేమెంట్ కార్పొరరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ)ను నీతి ఆయోగ్ కోరినట్లు తెలిసింది. అంతేకాకుండా నేషనల్ ఫైనాన్షియల్ ఇంక్లూసన్ ఫండ్ నుంచి రూ.125కోట్లను ఎన్ పీసీఐకు నీతిఆయోగ్ కేటాయించింది. ఎస్ బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, సిటీ బ్యాంకు, హెచ్ఎస్ బీసీ బ్యాంకుల రీటైల్ పేమెంట్లన్నీ ఎన్ పీసీఐ పరిధిలోనే జరుగుతాయి.
 
గ్రామీణ, చిన్న పట్టణాల ప్రాంతాల ప్రజలను ప్రోత్సహించేందుకే ఈ పథకాన్ని ప్రవేశపెడుతన్నట్లు పేరు తెలపడానికి ఇష్టపడని ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు. దేశంలో జరిగిన అన్ని నగదు రహిత లావాదేవీల ఐడీలను ప్రతి మూడు నెలలకు ఒకసారి డ్రా తీసి రూ.కోటి బహుమతిని, ప్రతి వారం తీసే డ్రాలో రూ.10లక్షల బహుమతిని అందజేస్తారని తెలిపారు. ప్రతివారం పది మంది వినియోగదారులకు, పది మంది వ్యాపారులకు బహుమతులు ఇస్తారని చెప్పారు. డిసెంబర్ నెలాఖరులోగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని తెలిసింది.
>
మరిన్ని వార్తలు