నాకేం సమాచారం అందలేదు: సీఎం

2 Sep, 2017 22:10 IST|Sakshi
నాకేం సమాచారం అందలేదు: సీఎం

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు అయినా.. ఎన్డీయే మిత్రపక్షాలు జేడీయూ, అన్నాడీఎంకే కేంద్ర మంత్రిమండలిలో చేరడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల బీజేపీతో చేతులు కలిపిన జేడీయూ, అన్నాడీఎంకేలకు కేంద్ర మంత్రిమండలిలో అవకాశం దక్కనుందని ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొత్త మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పటివరకు కొత్తగా కేబినెట్‌లో చేరే మంత్రులు ఎవరన్నది స్పష్టత రాలేదు.

ఈ విషయమై జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ మీడియా ప్రశ్నలకు బదులిచ్చారు. 'కేబినెట్‌ విస్తరణ గురించి మాకు ఎలాంటి సమాచారం అందలేదు. మీడియా ద్వారా మాకు తెలుస్తోంది' అని నితీశ్‌ మీడియాకు తెలిపారు. తమ పార్టీ ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా, తమ ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం తమకు అందలేదని జేడీయూ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. ఇక, అన్నాడీఎంకే కూడా కేంద్ర కేబినెట్‌లో చేరే అవకాశం కనిపించడం లేదు. సీఎం పళనిస్వామితో టీటీవీ దినకరన్‌ వర్గం తిరుగుబాటు చేయడంతో అన్నాడీఎంకేలో సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నేపథ్యంలో అన్నాడీఎంకేకు కేంద్ర కేబినెట్‌ విస్తరణలో అవకాశం ఉండకపోవచ్చునని వినిపిస్తోంది. ఇక మరో మిత్రపక్షం శివసేన కూడా కేంద్ర కేబినెట్‌ విస్తరణ నేపథ్యంలో అసంతృప్తిగానే కనిపిస్తోంది. విస్తరణలో తమ సభ్యులకు చోటు కల్పించే విషయమై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు.
 

మరిన్ని వార్తలు