యాప్‌లకు భద్రత ఏదీ?

8 Jan, 2017 04:31 IST|Sakshi
యాప్‌లకు భద్రత ఏదీ?

వీటి నుంచి లావాదేవీలతో మోసాలు అధికం ∙యాప్‌లకు భద్రతా సర్టిఫికెట్లు కావాల్సిందే..
జాతీయ స్థాయిలో ఏజెన్సీ ఏర్పాటు చేయాలి ∙సైబర్‌ నేరాలపై నిపుణుల అభిప్రాయాలు


(తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : క్యాష్‌తో పనేంటి?.. నగదు రహిత లావాదేవీలకు ఎన్ని మార్గాలు లేవు... ఒక్క క్లిక్‌తో క్షణంలో డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు.. పెద్దనోట్ల రద్దు తర్వాత తెరమీదకొచ్చిన కొత్త మంత్రమిది. కేంద్రంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే జపం చేస్తున్నాయి. గల్లీ షాపు మొదలుకొని ఢిల్లీ వరకూ ప్రతీ షాపులోనూ రకరకాల యాప్‌లు కన్పిస్తున్నాయి. వాటి ముందు మొబైల్‌ పెడితే ఇట్టే కోడ్‌ తీసుకుని లావాదేవీ జరిగిపోతుంది. సౌకర్యం బాగానే ఉంది. కానీ దీనివల్ల ఎదరయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కాదని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం భద్రత ప్రమాణాలే లేని వీటి నుంచి లావాదేవీలు చేస్తే రకరకాల మోసాలు జరగొచ్చని చెబుతున్నారు.

వ్యక్తిగత సమాచారమే హరించుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు. మనిషి జన్మించినా.. మరణించినా సర్టిఫికెట్‌ తప్పనిసరి. కానీ లక్షల కోట్ల లావాదేవీలు చేస్తూ.. కోట్లాది మంది ఉపయోగిస్తున్న మొబైల్‌ ఫోన్లు, యాప్‌లకు ఎందుకు భద్రత సర్టిఫికేట్లు అక్కర్లేదని ప్రశ్నిస్తున్నారు. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న సైబర్‌ నేరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. యావత్‌ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న సైబర్‌ నేరాలపై యువ శాస్త్రవేత్తలు విరుచుకుపడాలని, సైబర్‌ ఉగ్రవాదాన్ని కట్టడి చేసే దిశగా పరిశోధనలు జరగాలని సూచిస్తున్నారు. సైన్స్‌ కాంగ్రెస్‌లో భాగంగా ‘సైబర్‌ సెక్యూరిటీ’ అనే అంశంపై శనివారం ఓ సెమినార్‌ జరిగింది. పెద్దనోట్ల రద్దు తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జరిగిన ఈ సదస్సు అందరినీ ఆకట్టుకుంది. సెమినార్‌లో ఎవరేం మాట్లాడారంటే...

సెక్యూరిటీ ఏదీ?
మొబైల్‌ ఫోన్లు కొంటాం. దానికి రేడియేషన్‌ లేదని సర్టిఫికేట్‌ ఇస్తారు. కానీ ఆ ఫోన్‌ సేఫ్‌ అని మాత్రం తయారీ సంస్థగానీ, మరే ఇతర ఏజెన్సీగానీ గ్యారెంటీ ఇవ్వదు. ఆ మొబైల్‌ నుంచి జరిగే లావాదేవీలు, పాస్‌వర్డ్స్‌ వేరే వాళ్ల చేతికి వెళ్లవన్న భరోసా ఇవ్వరు. కానీ అమెరికాలో ఈ సిస్టమ్‌ లేదు. కచ్చితంగా సెక్యూరిటీ సర్టిఫికేట్‌ ఇవ్వాల్సిందే. సెక్యూరిటీ ప్రమాణాల కోసం జాతీయ స్థాయిలో ఓ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి.
– నరేంద్రనాథ్, టెలీ కమ్యూనికేషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌

సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు జరగాలి
పెద్దనోట్ల రద్దు తర్వాత అనేక యాప్స్, వాలెట్స్‌ ప్రజల్లో విస్తృత ప్రచారం పొందాయి. వ్యక్తిగత సమాచారం ఎవరైనా దొంగిలించరని నమ్మకం ఏమిటి? అందుకే ప్రభుత్వ పరంగానే ఓ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇలాంటి వాటి నుంచి వినియోగదారులకు భద్రత కల్పించేందుకు సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు జరగాలి.
– ఎన్‌ బాలకృష్ణన్, ఐఐటీ కంప్యూటర్‌ శాస్త్రవేత్త

నెట్‌వర్క్‌ ట్రాఫిక్‌ పెరిగింది.. సదుపాయాలేవీ?
ఒక చిన్న రోడ్డులోకి జాతీయ రహదారి నుంచి వెళ్లే వాహనాలను దారి మరలిస్తే ఎలా ఉంటుంది? ఇండియాలో పరిస్థితి ఇదే. లావాదేవీలు విపరీతంగా పెరిగినా... నెట్‌వర్క్‌లో మౌలిక సదుపాయాలు లేవు. మరో 20 ఏళ్లకు సరిపడా నెట్‌వర్క్‌ను అంచనా వేసి, అందుకు తగ్గట్టు నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయడానికి విస్తృత పరిశోధనలు జరగాలి.
– ఎస్వీ రాఘవన్, చీఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ ఆర్కియాలజిస్ట్, చెన్నై

>
మరిన్ని వార్తలు