నగదు కష్టాలు: ఏటీఎంలు మళ్లీ ఖాళీ!

8 Feb, 2017 08:53 IST|Sakshi
నగదు కష్టాలు: ఏటీఎంలు మళ్లీ ఖాళీ!
పెద్దనోట్లు రద్దు చేసిన కొన్నాళ్ల వరకు నగదు అందుబాటులో లేక, ఏటీఎంలు ఖాళీగా దర్శనమిచ్చి ప్రజలకు నానా కష్టాలు ఎదురయ్యాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే వస్తున్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో దాదాపు నాలుగోవంతు వాటిలో డబ్బులు ఉండట్లేదు. వాటి ముందు 'నో క్యాష్' బోర్డులు మళ్లీ దర్శనమిస్తున్నాయి. నెల మొదటి వారం కావడం, ఏటీఎంల నుంచి విత్‌డ్రా పరిమితి పెంచడంతో చెల్లింపుల కోసం ప్రజలు భారీగా డబ్బులు తీసేస్తున్నారని, దానివల్లే ఇలాంటి పరిస్థితి వస్తోందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అసంఘటిత రంగంలోని లక్షలాది మంది కార్మికులకు ఇప్పటికీ డబ్బు రూపంలోనే వేతనాలు చెల్లిస్తాని, సాధారణంగా నెల మొదటి వారంలో చెల్లింపులు చేయాల్సి ఉన్నందున నగదు ఎక్కువగా తీస్తున్నారని అన్నారు. దాదాపు 56 కోట్ల మందికి పైగా ఫ్యాక్టరీ వర్కర్లకు జీతాలు ఇవ్వాల్సి రావడంతో ఇలా ఏటీఎంలలో నగదు నిండుకుని ఉండొచ్చన్నది అధికారుల అభిప్రాయం. 
 
ఫిబ్రవరి పదోతేదీ నాటికల్లా ఈ నగదు కొరత తీరుతుందని, రెండు రోజుల్లో మళ్లీ అన్ని ఏటీఎంలలోను పూర్తిస్థాయిలో నగదు అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఏటీఎంల నుంచి ఒకేసారి రూ. 24వేల వరకు తీసుకునే అవకాశాన్ని రిజర్వు బ్యాంకు గత వారం కల్పించింది. అంతకుముందు ఈ పరిమితి చాలా తక్కువగా ఉండేది. కొన్ని కంపెనీలు మొదటి తేదీ నాడే జీతాలు ఇస్తే మరికొన్ని కంపెనీలు 10-15 తేదీల వరకు కూడా ఇస్తుంటాయని, దానివల్ల ఇంతకుముందు కంటే తాము ఏటీఎంలలో నగదు ఎక్కువగానే నింపుతున్నా త్వరగా అయిపోతోందని క్యాష్ లాజిస్టిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రితురాజ్ సిన్హా చెప్పారు. రోజుకు దాదాపు రూ. 12వేల కోట్ల నగదును ఏటీఎంలలో పెడుతున్నారు. అయితే నోట్ల రద్దుకు ముందు దాదాపు రూ. 13వేల కోట్లు పెట్టేవారు. పెద్ద నగరాల్లో కంటే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనే నగదు కొరత ఎక్కువగా కనిపిస్తోందని ఒక ప్రైవేటు రంగ బ్యాంకు అధికారి చెప్పారు. మొత్తానికి మరికొన్నాళ్ల పాటు ఈ కష్టాలు మాత్రం తప్పేలా లేవు.
మరిన్ని వార్తలు