మెరుగుపెడితే ‘ఉస్మానియా’ మరో చౌమొహల్లా

29 Jul, 2015 01:54 IST|Sakshi
మెరుగుపెడితే ‘ఉస్మానియా’ మరో చౌమొహల్లా

ఆస్పత్రి భవనం పటుత్వంపై సందేహాలొద్దు
కన్జర్వేషన్ ఇంజనీరింగ్‌తో వందల ఏళ్లు కాపాడొచ్చు
చారిత్రక అద్భుతాన్ని నేలకూల్చొద్దు
రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ హనుమంతరావు

 
హైదరాబాద్: శిథిలావస్థకు చేరిన చారిత్రక, వారసత్వ కట్టడమైన ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని తొలగించి ఆ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాల (ట్విన్ టవర్స్) ఆస్పత్రి నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రముఖ ఇంజనీరింగ్ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్, ఐరాస కన్సల్టెంట్ ఇ.ఎన్.సి హనుమంతరావు తప్పుబట్టారు. ఆ భవనాన్ని కొన్ని వందల ఏళ్లపాటు కళ్లముందు నిలిపే అవకాశం ఉన్నందున దాన్ని కూల్చొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ భవనం పటుత్వంపై సందేహాలొద్దన్నారు. ‘అదో అద్భుత నిర్మాణం.. అలనాటి నిర్మాణ శైలికి దర్పణం.. ప్రపంచవ్యాప్తంగా వారసత్వ కట్టడాలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మనం దానికి భిన్నంగా వ్యవహరించటం సరికాదు.. వందల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా మనగలిగేలా మలిచి ఆ నిర్మాణాన్ని భావితరాలకు అందివ్వాల్సి ఉంది. నిరంతరం నిర్వహణ పనులు కొనసాగిస్తే మరో 400 ఏళ్లయినా ఇంతే ఠీవిగా నిలబడే సత్తువ దానికుంది.

 ఉస్మానియా వర్సిటీ, హైకోర్టు భవనం సరసన నిలిచిన ఈ భవనం జీవితకాలాన్ని మనం సులభంగా నిర్ధారించలేం. అప్పట్లో అత్యంత పటుత్వంగా ఉండేలా వాటిని నిర్మించారు. అయితే కాలక్రమంలో గోడల పొరలు కొంత బలహీనపడి ఊడిపోవటం కద్దు. నిర్మాణంలో వినియోగించిన డంగు సున్నం వాతావరణ ప్రభావంతో బలహీనపడినంత మాత్రాన భవనమే పటుత్వం కోల్పోయిందని అనడం  సరికాదు. పునాదులను బలహీనపడే పటుత్వం లేని భూమి కాదిది. గోడలు శిథిలమైన దాఖలాలేవీ లేవు. పైకప్పు జాక్ ఆర్చి రూఫ్ డిజైన్‌లో ఉంటే దాన్ని క్రాస్ గర్డర్‌లో సరిచేయొచ్చు, భారీ భూకంపాలు వస్తే తప్ప ఆ భవనం కూలే అవకాశమే లేదు’ అని పేర్కొన్నారు.

సంరక్షణ చర్యలే కీలకం...
గతంలో రాజ్‌భవన్ పైకప్పు నుంచి పెచ్చులూడి కిందపడటంతో ఆ భవనం శిథిలావస్థకు చేరుకుందనే భావన వ్యక్తమైందని, కానీ శాస్త్రీయ పద్ధతిలో దానికి సంరక్షణ చర్యలు చేపట్టడంతో అది ఠీవిగా కొనసాగుతోందని హనుమంతరావు గుర్తుచేశారు. అలాగే కొన్నేళ్లక్రితం వరకు కాలం తీరిన భవనాల జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించిన చౌమొహల్లా ప్యాలెస్ ఇప్పుడు విదేశీ పర్యాటకులను గొప్పగా ఆకట్టుకుంటోందని...అందుకు సంరక్షణ చర్యలే కారణమన్నారు. ఇటలీలో ఓ పక్కకు ఒరిగిన ప్రపంచ ప్రఖ్యాత ‘లీనింగ్ టవర్ ఆఫ్ పీసా’ను కన్జర్వేషన్ ఇంజనీరింగ్ ద్వారానే కాపాడుతున్నారన్నారు. కన్జర్వేషన్ ఇంజనీరింగ్ పద్ధతులను అవలంబించి మరమ్మతు చర్యలు చేపడితే ఉస్మానియా ఆస్పత్రి భవనం మరో చౌమొహల్లా ప్యాలెస్‌గా వెలుగొందుతుందన్నారు. ఆస్పత్రి భవనం పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లేదా జేఎన్‌టీయూ నుంచి నివేదిక తెప్పించుకోవచ్చన్నారు.
 

>
మరిన్ని వార్తలు