శిరీషపై అత్యాచారం జరగలేదు!

29 Jun, 2017 11:00 IST|Sakshi
శిరీషపై అత్యాచారం జరగలేదు!

హైదరాబాద్‌ : బ్యూటీషియన్‌ శిరీషపై అత్యాచారం జరగలేదని ఎఫ్‌ఎస్‌ఎల్‌ ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులకు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక అందినట్లు తెలుస్తోంది. శిరీష దుస్తులపై ఉన్న మరకల ఆధారంగా ఈ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కాగా ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక తమకు ఇంకా అందలేదని పోలీసులు చెబుతునక్నారు.

అయితే ఫోరెన్సిక్‌ పరీక్ష రిపోర్ట్‌ పూర్తిస్థాయిలో వస్తేనే ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది అధికారికంగా, స్పష్టంగా చెప్పగలమని పోలీసులు చెబుతున్నారు. అయితే శిరీషపై అత్యాచారం జరగలేదని నిందితులు రాజీవ్‌, శ్రావణ్‌లు విచారణలో చెప్పారని, హైదరాబాద్‌ నుంచి కుకునూర్‌పల్లి వరకూ ఆరుచోట్ల సీసీ ఫుటేజ్‌ సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్‌జే స్టూడియోలో రాజీవ్‌కు సంబంధించిన వీడియోలు సేకరించినట్లు పేర్కొన్నారు.

కాగా కుకునూర్‌పల్లిలో ఎస్‌ఐ ప్రభాకర్‌ రెడ్డి ఆమెపై అత్యాచారయత్నం చేయడంతో పాటు అనంతరం జరిగిన ఉదంతం నేపథ్యంలోనే మనస్తాపంలో శిరీష ఆత్మహత్య చేసుకుని ఉంటుందని, ఆమెది ముమ్మాటికీ ఆత్మహత్యేనని పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే శిరీష కుటుంబసభ్యులు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ముమ్మాటికీ హత్యనేని ఆరోపిస్తున్నారు. మరోవైపు శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు బోదాసు శ్రవణ్‌(21), వల్లభనేని రాజీవ్‌ (31) పోలీస్‌ కస్టడీ ముగియడంతో  వారిని నిన్న కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

మరిన్ని వార్తలు