సుప్రీం తీర్పు: ఆధార్ కాన్సెప్ట్‌లో లోపం లేదు!

24 Aug, 2017 14:09 IST|Sakshi
సుప్రీం తీర్పు: ఆధార్ కాన్సెప్ట్‌లో లోపం లేదు!

న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యత కూడా ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ పార్టీ స్వాగతించింది. గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్‌ పథకంలో ఎలాంటి లోపం లేదని, వ్యక్తిగత గోప్యతకు ఇది విరుద్ధం కాదని కాంగ్రెస్‌ పార్టీ  సీనియర్‌ నేత చిదంబరం పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వమే వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేలా ఆధార్‌ను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. 

'ప్రైవసీ హక్కుకు అనుగుణంగా ఆధార్‌ పథకాన్ని తీసుకొచ్చాం. ప్రస్తుత ప్రభుత్వం ఆర్టికల్‌ 21కి ఇచ్చిన నిర్వచనమే వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘిస్తోంది. ఆధార్‌ కాన్సెప్ట్‌లో ఎలాంటి లోపమూ లేదు. ఆధార్‌ను ఒక సాధనంగా వాడుకోవాలన్న, దుర్వినియోగం చేయాలన్న మోదీ ప్రభుత్వం ఆలోచనలోనే లోపముంది' అని చిదంబరం విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. సుప్రీంకోర్టు నిర్ణయం ఫాసిస్టు శక్తులకు ఎదురుదెబ్బ అని, నిఘా వేసి అణచివేయాలన్న బీజేపీ భావజాలానికి ఇది తిరస్కృతి అని ఆయన ట్వీట్‌ చేశారు.

సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఆధార్‌ కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లను పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం ప్రజాబాహుళ్యంలో గోప్యత వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశాలూ ఉన్నాయని గతంలో పేర్కొంది. వ్యక్తిగత గోప్యత కూడా రాజ్యంగంలోని ఆర్టికల్‌ 21(జీవించే హక్కు) కిందకు వస్తుందని సుప్రీంకోర్టు తాజాగా చరిత్రాత్మక తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆధార్‌ పథకంపై నీలినీడలు కమ్ముకునే అవకాశముంది. ఆదాయపన్ను, పాన్‌ కార్డు సహా సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం వంటి నిర్ణయాలు ప్రభావితం కానున్నాయి.
 

మరిన్ని వార్తలు