అక్రమార్కులకే ఇబ్బంది.. ‘నితాఖత్’పై సౌదీ వివరణ

22 Nov, 2013 03:54 IST|Sakshi

న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో అమల్లోకొచ్చిన కొత్త కార్మిక చట్టం ‘నితాఖత్’ వల్ల అక్కడ న్యాయంగా ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి ఎలాంటి ఇబ్బంది కలగదని ఆ దేశం  స్పష్టం చేసింది. కేవలం సౌదీలో అక్రమంగా ఉద్యోగాలు చేసుకుంటున్న వారిపైనే ప్రభావం ఉంటుందని పేర్కొంది. నితాఖత్ వల్ల సౌదీలోని భారతీయ కార్మికులు కష్టాలు పడుతున్నారని వస్తున్న వార్తలపై న్యూఢిల్లీలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం గురువారం స్పందించింది.

 

తామిచ్చిన కాలపరిమితిలో అత్యధికంగా 14 లక్షలకు పైగా భారతీయులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించుకున్నారని వెల్లడించింది. దాంతో దేశంలో న్యాయంగా నివసిస్తున్న భారతీయుల సంఖ్య 28 లక్షలకు చేరిందని తెలిపింది. ఆ కాలపరిమితి నవంబరు 3తో ముగిసిందని, ఉద్యోగులు, కార్మికులు ఏ దేశం వారనే విషయం నితాఖత్ పరిగణనలోకి తీసుకోదని పేర్కొంది. సౌదీ అరేబియా అభివృద్ధిలో భారతీయుల పాత్ర కీలకమని ప్రశంసించింది.

మరిన్ని వార్తలు