ప్రభుత్వానికి నష్టమెలా?

28 Aug, 2013 00:43 IST|Sakshi

తమ సంస్థలో పెట్టుబడులపై  పీఎంఎల్‌ఏ అథారిటీ ముందు ‘జగతి’ వాదనలు
అసలు ఇది మనీలాండరింగ్ కేసు ఎలా అవుతుంది?
ప్రభుత్వం నుంచి పెట్టుబడిదారులకు దక్కిన ప్రయోజనాలేంటి?
వారేమైనా నష్టపోయినట్లు ఫిర్యాదు చేశారా?
అవేవీ లేనపుడు ‘జగతి’ డిపాజిట్లు ఎలా అటాచ్ చేస్తారు?
 తదుపరి విచారణ వచ్చేనెల 27కు వాయిదా

 
 సాక్షి, న్యూఢిల్లీ: వ్యాపారవేత్తలు టి.ఆర్.కణ్ణన్, మాధవ్ రామచంద్ర, ఎ.కె.దండమూడి మున్ముందు లాభాలొస్తాయనే ఉద్దేశంతోనే జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టారని, ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది అందుకు ప్రతిగా జగతిలోకి నిధులు తరలించారనడం పూర్తిగా అవాస్తవమని జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాది రవి గుప్తా స్పష్టంచేశారు. జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.34.65 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీలు) అటాచ్‌మెంట్ కేసుపై ఢిల్లీలోని పీఎంఎల్‌ఏ న్యాయ ప్రాధికార సంస్థ చైర్మన్ కె.రామమూర్తి ఎదుట మంగళవారం ఆయన ఈ మేరకు వాదనలు వినిపించారు.
 
 ఆ ఇన్వెస్టర్లూ ఎలాంటి ప్రభుత్వ ప్రాజెక్టులూ చేపట్టలేదని, ఈడీ మాత్రం వారు జగతిలో పెట్టిన పెట్టుబడులతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందంటోందని, ఆ నష్టం వివరాలు మాత్రం చెప్పటం లేదని తెలియజేశారు. ‘‘ఒక సంస్థలో ఎవరైనా లాభాలు వస్తాయన్న ఉద్దేశంతో పెట్టుబడులు పెడితే దాంతో ప్రభుత్వ ఖజానాకు నష్టమెలా వస్తుంది? పైగా మోసం చేశారని అనడమేంటి? అసలు ఇది మనీలాండరింగ్ కేసు ఎలా అవుతుంది?’’  అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే శంకర్రావు ఒక లేఖ రాస్తే దాన్నే పిటిషన్‌గా పరిగణించారని, హైకోర్టు అమికస్ క్యూరీని నియమించినా ఆయన పిటిషనర్ కోసమేనని చెప్పారు. ‘‘అమికస్ క్యూరీ స్వతంత్రంగా నివేదిక ఇచ్చినట్లు ఈడీ చెబుతోంది. కానీ ఆయన్ను పిటిషనర్ ప్రయోజనాలను పరిరక్షించేందుకు కోర్టు నియమించింది. పిటిషనర్ ప్రతినిధిగా మారినపుడు అమికస్ క్యూరీ స్వతంత్ర అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఎలా సాధ్యం? ఆ నివేదిక నిష్పాక్షికమైనదని ఎలా చెబుతారు’’ అని ఆయన అన్నారు.
 
 హైకోర్టు చెప్పిందొకటి.. ఎఫ్‌ఐఆర్ ఒకటి.. చార్జిషీట్ మరొకటి
 హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో ఉన్నది ఒకటైతే ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలు వేరని, ఇక చార్జిషీట్‌లో పొందుపరిచిన అంశాలకు అసలు సంబంధమే లేదని రవి గుప్తా వివరించారు. ఈడీ వాదన పొంతన లేకుండా ఉందని చెప్పారు. పెట్టుబడి పెట్టిన ముగ్గురూ.. తర్వాత ప్రాసిక్యూషన్ తరఫు సాక్షులుగా మారారని, వారి స్టేట్‌మెంట్లను ఈడీ రికార్డు చేసిందని, ప్రభుత్వం నుంచి దక్కిన లబ్ధికి ప్రతిఫలంగానే పెట్టుబడులు పెట్టామని వారెక్కడా చెప్పలేదని వివరించారు. డెలాయిట్ నివేదికపై ఈడీ ఆరోపణలను ఆయన ఖండించారు. ‘‘ఆ నివేదిక సాయంతో ఇన్వెస్టర్లను మోసం చేస్తే అది వారికి, కంపెనీకి మధ్య చీటింగ్ కేసు.
 
 అది కూడా కంపెనీల చట్టం కింద. అంతేతప్ప ఇందులో ప్రభుత్వాన్ని మోసం చేయడమనేది ఎక్కడుంది? దీనిపై పీఎంఎల్‌ఏ కేసు ఎలా పెడతారు?’’ అని ప్రశ్నించారు. జగతి షేర్లను రూ.350 చొప్పున విక్రయించ డం అక్రమం అనడాన్ని ప్రస్తావిస్తూ... ‘ఈనాడు’ని ప్రచురించే ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ సంస్థ తమ షేర్లను రూ.5.28 లక్షల ప్రీమియంతో విక్రయించిందని, ఆది నుంచీ నష్టాల్లోనే ఉంటూ 30 ఏళ్లుగా అదే ఒరవడిని సాగించిన సంస్థ ఇంత భారీ ధరకు షేర్లను విక్రయించగా లేనిది అత్యధిక సర్క్యులేషన్‌తో మార్కెట్‌లోకి ప్రవేశించిన జగతి తన షేర్లను రూ.350ధరకు విక్రయించడం తప్పెలా అవుతుందని రవి గుప్తా ప్రశ్నించారు.
 
 కణ్ణన్ ఎలా నష్టపోయారు?: ‘‘జయలక్ష్మి టెక్స్‌టైల్స్ డెరైక్టర్ కణ్ణన్ ఆంధ్రప్రదేశ్‌లో జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీని స్థాపించారు. దీనికి సంబంధించి ఏ ఒక్కటి కూడా వైఎస్సార్ హయాంలో జరగలేదు. ఆయన జగతిలో పెట్టిన రూ.5 కోట్ల పెట్టుబడులకు షేర్లు పొందారు. ఇక్కడ ప్రభుత్వానికొచ్చిన నష్టమేంటి? కణ్ణన్ ఎలా నష్టపోయారు? ఎన్నారై వ్యాపారవేత్త మాధవ్ రామచంద్ర రూ.19.65 కోట్లను జగతిలో పెట్టారు? ఇందులో పీఎంఎల్‌ఏ కేసుకు ఆస్కారమెక్కడ? ఎ.కె.దండమూడి రూ.10 కోట్లు పెట్టి ఈక్విటీ షేర్లను పొందారు. ఇక్కడా పీఎంఎల్‌ఏ సెక్షన్లు ఎలా వస్తాయి? తమ డబ్బును వ్యాపార లాభాల కోసం ఎక్కడైనా ఎవరైనా పెట్టుకోవచ్చుగా’’ అని రవి వాదించారు.
 
 అంతకుముందు ఈడీ తరఫు న్యాయవాది విపుల్‌కుమార్ వాది స్తూ... ఆ ముగ్గురి పెట్టుబడుల వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందన్నారు. ఆ నిధు లు ముడుపులుగా తేల్చామని, అందుకే 34.65 కోట్ల జగతి ఫిక్స్‌డ్ డిపాజిట్లను అటాచ్ చేశామని చెప్పారు. తర్వాత రవి గుప్తా వాదనలు వినిపిస్తుండగా.. విపుల్‌కుమార్ లేచి, తాను మరో కేసుకు హాజరవ్వాల్సి ఉన్నందున మరో రోజున వాదనలు వినాలని కోరారు. ఇందుకు రామమూర్తి సమ్మతిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 27కు వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు