ఖతర్‌లో భారతీయ కార్మికులకు కష్టాలు

20 Jul, 2017 19:26 IST|Sakshi
ఖతర్‌లో భారతీయ కార్మికులకు కష్టాలు

►ఖతర్‌లో కుదేలవుతున్న నిర్మాణరంగం
►భారతీయ కార్మికులపై ప్రభావం

ఖతర్‌తో ఇతర అరబ్‌దేశాలు సంబంధాలు తెంచుకున్న ఫలితంగా అక్కడి నిర్మాణ రంగం కుదేలవుతోంది. ఫలితంగా ఆ రంగంలో ఉపాధి పొందుతున్న భారతీయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిలేక... మరోచోట పనిచేయడానికి వీల్లేక, ఖతర్‌లో ఉండలేక, స్వదేశానికి తిరిగి రాలేక... దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 2022 సాకర్‌ వరల్డ్‌కప్‌కు ఖతర్‌ ఆతిథ్యమిస్తోంది. దీనికోసం స్టేడియాలతో పాటు భారీ ఎత్తున్న మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది.

ఆంక్షలు అమల్లోకి వచ్చి నెలన్నర రోజులు దాటడంతో నిర్మాణ రంగానికి అవసరమైన మెటీరియల్‌ సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సామాగ్రి అందుబాటులో లేక నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. సుమారు 20 లక్షల మంది విదేశీ కార్మికులుంటే... వీరిలో అత్యధికులు నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారు. ఖతర్‌ జనాభాలో 90 శాతం మంది విదేశీ కార్మికులే. ఇప్పుడు నిర్మాణాలు నిలిచిపోవడంతో కంపెనీలు కార్మికులకు దీర్ఘకాలిక సెలవులపై ఇంటికి పంపేస్తున్నాయి.

సాధారణంగా ఏడాది ఒక నెల సెలవు ఇచ్చే కంపెనీలు ఇప్పుడు ఐదునెలలు సెలవులు ఇస్తున్నాయి. కంపెనీ స్పాన్సర్డ్‌ వీసాలపైనే ఖతర్‌కు విదేశీ కార్మికులు వెళుతుంటారు. కాబట్టి ఆ కంపెనీ పని కల్పిస్తే సరి. లేదంటే మరోచోట పనిచేసుకోవడానికి ఆస్కారం ఉండదు. అక్కడుంటే పని లేదు... స్వదేశానికి తిరిగి వెళ్తే మళ్లీ రావడం ఆర్థికభారం. దీంతో ఖతర్‌లోని విదేశీ కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇప్పటికే మూడు లక్షల మంది కార్మికులు ఖతర్‌ను వదిలివెళ్లినట్లు అంచనా. నిర్మాణాలు క్రమేపీ నిలిచిపోతుండటంతో విదేశీ కార్మికుల ఖతర్‌ కల చెదిరిపోతోంది.

అలాగే ఖతర్‌ యజమానులు కొందరు సౌదీ అరేబియాలో తమ ఫామ్‌హౌస్‌లలో పనిచేయడానికి, పశువుల కాపరులుగా భారతీయ కార్మికులను నియమించుకున్నారు. ఖతర్‌ వీసాలపై వీరిని తీసుకొచ్చి తాత్కాలిక అనుమతులతో సౌదీలో పనిలో పెట్టుకున్నారు. ఖతర్‌ దేశస్తులు వెంటనే సౌదీని వదిలివెళ్లాల్సిందిగా ఆదేశించడంతో యజమానులు వెళ్లిపోయారు. రోడ్డుమార్గాన్ని మూసివేసినందువల్ల వారి వద్ద పనిచేస్తున్న భారతీయ కార్మికులు దోహాకు వెళ్లడానికి సౌదీ అనుమతించడం లేదు. దాంతో వీరంతా ఆహారం, నగదు లేకుండా రోడ్డునపడ్డారు. మరో సమస్య ఏమిటంటే వీరిప్పుడు చట్టవిరుద్ధంగా సౌదీలో ఉంటున్న వారవుతారు.

ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ ఖతర్‌తో అన్నిరకాల సంబంధాలను తెంచుకుంటున్నట్లు సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, బహ్రయిన్, ఈజిప్టు జూన్‌ 5న ప్రకటించాయి. ఖతర్‌కు ఉన్న ఏకైక రోడ్డు మార్గాన్ని సౌదీ అరేబియా మూసివేసింది. పోర్టుల్లో ఖతర్‌కు వెళుతున్న నౌకలకు ప్రవేశాన్ని నిరాకరించాయి. విమానాలను రద్దు చేశాయి. తీవ్రవాద సంస్థలకు సాయం చేయకూడదని, అల్‌ జజీరా టీవీ ఛానల్‌ను మూసివేయాలని.. ఇలా కొన్ని డిమాండ్లు పెట్టాయి. వీటికి ఖతర్‌ సమ్మతించడం లేదు.

కువైట్‌ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఆర్థికంగా బలమైన దేశం కావడంతో ఖతర్‌ ఈ ఆంక్షలను తట్టుకొని... ఇరాన్, టర్కీల నుంచి ఆహారపదార్థాలు, ఇతరత్రా సామాగ్రిని తెచ్చుకుంటోంది. ఖతర్‌లో 6.5 లక్షల మంది భారతీయ కార్మికులు ఉన్నారు. వీరు ఏటా 27 వేల కోట్ల రూపాయలను భారత్‌కు పంపుతున్నారు. నిర్మాణ రంగం కుదేలవడంతో భారతీయ కార్మికులకు పనిలేకుండా పోతోంది. గతంలో చేసిన పనికి వేతనాలు అందక వీరిలో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా