-

'ఐటీ ఇండస్ట్రీ భయపడక్కర్లేదు'

24 Mar, 2017 12:09 IST|Sakshi
'ఐటీ ఇండస్ట్రీ భయపడక్కర్లేదు'
న్యూఢిల్లీ : హెచ్-1బీ వీసాలపై  తీసుకొచ్చే కఠినతర నిబంధనలకు ఐటీ ఇండస్ట్రీ ఆందోళన చెందాల్సినవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఈ విషయంపై భారత ప్రభుత్వం ట్రంప్ కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐటీ ప్రొఫిషనల్స్కు జారీచేసే హెచ్-1బీ, ఎల్1 వీసాలకు సంబంధించి నాలుగు బిల్లులు అమెరికా కాంగ్రెస్ ముందుకు వచ్చాయి, కానీ వాటిని వారు ఆమోదించలేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఐటీ ఇండస్ట్రీ, భారతీయుల ప్రజలు ప్రభావితం కాకుండా అమెరికాలో పైస్థాయి అధికారులతో చర్చలు జరుపుతున్నామని ఆమె చెప్పారు.
 
హెచ్-1బీ, ఎల్1 వీసాలకు సంబంధించిన ఆ బిల్లులను అలానే ఆమోదించకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. విదేశాంగ కార్యదర్శి, అమెరికా కాంగ్రెస్ సభ్యులతో సమావేశమయ్యారని, ప్రస్తుతం భయపడాల్సిన పనిలేదని ఆమె భరోసా ఇచ్చారు. తాము ఉద్యోగాలను దొంగలించడం లేదని, అమెరికా ఆర్థికవ్యవస్థకు సహకరిస్తున్నామని వారికి చెప్పామన్నారు. రాజ్యసభలో గురువారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాలపై మాట్లాడారు. ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా విధానాల్లో మార్పులు వస్తున్నాయని చెప్పడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు..
 
డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు నుంచీ హెచ్-1బీ వీసా పాలసీపై ఆందోళనలు వస్తున్నాయని సుష్మా స్వరాజ్ తెలిపారు. కాగ 1990లో మొదటిసారి హెచ్-1బీ వీసాలను ప్రవేశపెట్టారు. అప్పుడు 65వేల వీసాలను జారీచేశారు. అనంతరం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 2000లో ఈ వీసాల జారీని మూడింతలు పెంచి, 1,95,000లకు పెంచారు. కానీ మళ్లీ 2004లో ఈ వీసాల జారీని అమెరికా 65వేలకు తగ్గించేసింది.  అంటే ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు నుంచే దీనిపై ఆందోళనలు ఉన్నాయని సుష్మా స్వరాజ్ అర్థమవుతుందన్నారు.
మరిన్ని వార్తలు