రేపటితో ముగింపు?

12 Dec, 2013 08:49 IST|Sakshi
రేపటితో ముగింపు?

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలను ముందుగానే ముగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం ముగియాల్సిన తేదీ కంటే వారం ముందుగానే అంటే.. శుక్రవారం నుంచి ఉభయ సభలూ నిరవధికంగా వాయిదాపడే అవకాశాలున్నాయని పార్లమెంటు వర్గాలు చెబుతున్నాయి. ఉభయ సభల్లోనూ గురువారం సాయంత్రానికల్లా ఆర్థిక వ్యవహారాలను ముగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. అవి  ముగిసిపోతే అసలు గురువారమే పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడే అవకాశాలూ లేకపోలేదని కొందరు నేతలు అంటున్నారు. మరోవైపు బుధ, గురు, శుక్రవారాల్లో పార్టీ ఎంపీలందరూ పార్లమెంటులో అందుబాటులో ఉండి.. ప్రభుత్వ వ్యవహారాలకు అనుగుణంగా ఓటేయాలంటూ కాంగ్రెస్ ఇప్పటికే విప్ జారీ చేసింది. ఈ నెల 5న మొదలైన పార్లమెంటు సమావేశాలు ఇంతకుముందు నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల 20 వరకు సాగాల్సి ఉంది. వీటిని ముందే ముగిస్తారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ మండిపడింది.
 
 

మూడోరోజూ స్తంభించిన ఉభయ సభలు: పలు అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మూకుమ్మడి దాడికి దిగడంతో వరుసగా మూడోరోజు పార్లమెంట్ ఉభయసభలు స్తంభించా యి. ఉదయం 11లకు లోక్‌సభ సమావేశమైనపుడు స్పీకర్ మీరాకుమార్ లోపలికి అడుగుపెట్టారో లేదో పలు పార్టీల సభ్యులు నినాదాలతో ఆందోళనకు దిగారు. వివిధ సమస్యలపై పెద్దపెట్టున నినదించారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో చలిపులి బారిన పడి మరణించిన 60మందికి సంతాపం తెలిపే ప్రకటనను ఈ నినాదాల మధ్యే స్పీకర్ చది వారు. మృతులకు అంజలి ఘటించడానికి సభ్యులందరూ తమ స్థానాల్లో నిలబడాలని ఆమె కోరారు. అయినా పలువురు సభ్యులు వెల్‌నుంచి వెళ్లకుండా అక్కడే ఉండటంతో ఆమె ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తంచేయడంతో సభ్యులందరూ తమ స్థానాలకు వెళ్లారు.
 
 మృతులకు అంజలి ఘటించడం పూర్తయిన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో ఆయా పక్షాల సభ్యులు మళ్లీ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయసాగారు. టీడీపీ సహా పలు పార్టీలవారు వెల్‌లో గొడవ చేయగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్, ఎంపీలు మేకపాటి, ఎస్పీవై రెడ్డి మొదటివరుస బెంచీలవరకు వెళ్లి అక్కడ నిలబడి ఆందోళన సాగించారు. ‘కీప్ ఆంధ్రప్రదేశ్ యునెటైడ్’(ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచండి) అనే నినాదం రాసివున్న ప్లకార్డులను మేకపాటి, ఎస్పీవై ప్రదర్శించారు. అవిశ్వాసానికి నోటీసిచ్చిన ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు తమ స్థానాల్లోనే నిలబడగా అధికార పక్షానికే చెందిన తెలంగాణ ఎంపీలు కూడా మొదటివరుస బెంచీలవరకు వచ్చి పోటీ ఆందోళన జరిపారు.

 

తమ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై బీఎస్పీ, ఎస్పీ, డీఎంకే, ఆర్‌జేడీ నినాదాలతో హోరెత్తించాయి. దీంతో సభలో ఎవరేం మాట్లాడుతున్నారో తెలీని పరిస్థితి ఉండటంతో స్పీకర్ సభను 12వరకు వాయిదావేస్తున్నట్టు 11.04 గంటలకు ప్రకటించారు. సభ తిరిగి మొదలైనపుడు ఉదయం దృశ్యాలే పునరావృతమయ్యాయి. గందరగోళం మధ్యే స్పీకర్ ఆదేశాల ప్రకారం మంత్రులు, కమిటీల సంబంధితులు తమ పత్రాలను సభకు సమర్పించారు. ఆర్థికమంత్రి పి.చిదంబరం అనుబంధ పద్దులను సభలో ప్రవేశపెట్టారు. ఇదయ్యాక స్పీకర్ అవిశ్వాసం నోటీసుల అంశాన్ని ప్రస్తావించారు.
 
 మూడు నోటీసులు అందాయి: అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మూడు నోటీసులు తనకు అందాయని స్పీకర్ మీరాకుమార్ సభలో ప్రకటించారు. సభలో సాధారణ పరిస్థితులు నెలకొంటే తాను ఆ నోటీసులను సభ ముందుంచగలుగుతానన్నారు. దీంతో జగన్, మేకపాటి, ఎస్‌పీవై తమ స్థానాలకు తిరిగి వెళ్లగా వెల్‌లో ఆందోళన చేస్తున్న సభ్యులు అక్కడే ఉన్నారు.
 
 వారికి ఒకటికి రెండుసార్లు విజ్ఞప్తి చేసినా ఆందోళన సాగిస్తున్న ఇతర సభ్యులు తగ్గకపోవడంతో ఆమె 377వ నిబంధన కింద ప్రస్తావించే అంశాలను సభకు సమర్పించాల్సిందిగా సభ్యులను కోరారు. అనంతరం 12.07కు సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.


 రాజ్యసభదీ అదే తీరు: రాజ్యసభ ఉదయం 11లకు సమావేశమైన వెంటనే సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాలను చేపట్టిన సభాధ్యక్షుడు హమీద్ అన్సారీ ఆందోళన చేస్తున్న సభ్యులను శాంతింపచేయడానికి ప్రయత్నించినా వారు వినలేదు. దీంతో రెండు నిమిషాలకే సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 12గంటలకు సభ తిరిగి ఆరంభమైనపుడు 2జీ స్కాంలో జేపీసీ నివేదికపై చర్చకు బీజేపీ పట్టుబట్టింది. మరోవైపు ఎస్పీ, బీఎస్పీ తమ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై నినాదాలు కొనసాగించాయి. సభలో గందరగోళం నెలకొనడం తో డిప్యూటీ చైర్మన్ సభను వాయిదావేశారు. 2 గంటలకు సభ సమావేశమైనపుడు కూడా ఇదేపరిస్థితి పునరావృతం కావడం తో 2 నిమిషాలకే సభను డిప్యూటీ చైర్మన్ మరుసటి రోజుకు వాయిదావేసేశారు.
 

మరిన్ని వార్తలు