పాత పర్మిట్లతోనే..

7 Dec, 2013 03:21 IST|Sakshi
పాత పర్మిట్లతోనే..

ఓ రాష్ట్రంలో అనుమతులతోనే ఇరు రాష్ట్రాల్లో తిరగవచ్చు
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యే నాటికి వాహనాలు తీసుకున్న పర్మిట్లతోనే ఇరు రాష్ట్రాల్లోనూ తిరగవచ్చని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ముసాయిదా బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. ఒక రాష్ట్రంలోని రవాణా శాఖ కార్యాలయాల్లో అనుమతి పొందినందున మరో రాష్ట్రంలో తిరుగనీయబోమని అనడానికి వీల్లేదని పేర్కొంది. ఇతర రాష్ట్ర వాహనం అయినందున ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని చెప్పడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది.
 
రాష్ట్ర విభజన జరిగే ముందురోజు వరకు ప్రస్తుత రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో అనుమతులు తీసుకున్నా.. వాటి వ్యాలిడిటీ ఉన్నంతకాలం రెండు రాష్ట్రాల్లోనూ తిరిగే హక్కు ఉంటుందని పేర్కొంది. ట్రాన్స్‌పోర్టు వాహనాల నుంచి ఎలాంటి టోల్, ప్రవేశ రుసుములు వసూలు చేయడానికి వీల్లేదని తెలిపింది. ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో టోల్ టాక్స్, ప్రవేశ రుసుములు, ఇతర చార్జీలు వసూలు చేయాల ంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని, కేంద్రం రెండు రాష్ట్రాలతో చర్చించి నిర్ణయిస్తుందని పేర్కొంది. అయితే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో లేదా ప్రభుత్వం వాణిజ్య అవసరాల కోసం రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించినా, అభివృద్ధి చేసినా వాటి వద్ద టోల్, ప్రవేశ రుసుములు వసూలు చేయవద్దన్న నిబంధన వర్తించదని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు