'హడావుడి' బిల్లులపై విపక్షం వాకౌట్

4 Sep, 2015 04:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: నిర్మాణాత్మక చర్చ చేపట్టడానికి అవకాశం లేకుండా అసెంబ్లీలో హడావుడిగా బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం పొందడాన్ని వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది. ఇప్పటికిప్పుడే ప్రవేశపెట్టి, ఇప్పుడే చర్చించడం ఎలా సాధ్యమని విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నిం చారు. బిల్లులు పెడుతున్న విధానాన్ని నిశితంగా విమర్శించారు. గురువారం సభలో ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెట్టడానికి స్పీకర్ అనుమతించినప్పుడు.. విపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడారు. కనీసం  7రోజుల సమయం ఇవ్వాలని సూచిస్తున్న రూల్-90లోని నాలుగో పేరాని విపక్ష నేత సభలో చదివి వినిపించారు.


అందుకే తాను 15రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేసినా, 5రోజులకే పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్‌కు ఉన్న విశేషాధికారాన్ని ఉపయోగించుకొని బిల్లులు ప్రవేశపెట్టిన వెంటనే చర్చ, ఆమోదం అనడం సభాసంప్రదాయాలకు విరుద్ధమని చెప్పారు. గురువారం ప్రవేశపెడుతున్న బిల్లులో వివాదాస్పదమైనవీ ఉన్నాయని, కేసులను వేగవంతం చేసి ఆస్తులను ఆటాచ్ చేసే బిల్లును ప్రత్యర్థులను వేధించడానికి ప్రభుత్వం వాడుకుంటే పర్యవసానాలు దారుణంగా ఉంటాయన్నారు. బిల్లులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి చర్చించడానికి అవకాశం ఇవ్వాలని కోరారు.


విపక్ష నేత జగన్ సూచనకు స్పీకర్ కోడెల సానుకూలంగా స్పందించలేదు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అనుమతి ఇచ్చానని సమాధానం ఇచ్చారు. 'ప్రతిపక్షం అడిగినా ఇలా తోసిపుచ్చుతామంటే(బుల్డోజ్ చేస్తామంటే)...' అని జగన్ మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్‌చేసి ఆర్థిక మంత్రి యనమలకు ఇచ్చారు. ఎవరినీ బుల్డోజ్ చేసే ఉద్దేశం లేదని, సమయం లేకపోవడం, అత్యవసరం దృష్ట్యా ఇలా చేయాల్సి వచ్చిందని యనమల వివరణ ఇచ్చారు. జగన్ మళ్లీ గట్టిగా ప్రశ్నించారు. 'ఆయన(మంత్రి) 'మూవ్' అంటారు.. మీరు(స్పీకర్) ఐస్ హ్యావ్ ఇట్ అంటారు.. అయిపోతుంది. ఇదేనా బిల్లులకు ఆమోదం తెలిపే పద్ధతి?' అని మండిపడ్డారు. ‘ఇదే మాదిరి బుల్డోజ్ చేస్తామంటే సభలో ప్రతిపక్షం ఉండటం ఎందుకు? ఈ వైఖరికి నిరసనగా మేం వెళతాం. తర్వాతే పిలవండి' అని చెబుతూ సభ నుంచి వాకౌట్ చేశారు.

మరిన్ని వార్తలు